పురోగతి లేని పర్యాటక ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2022-04-05T05:40:54+05:30 IST

అందాల అరకులోయలో పర్యాటక ప్రాజెక్టులు పడకేశాయి. తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన పనులు వైసీపీ అధికారంలోకి రాగానే అర్ధంతరంగా నిలిచిపోయాయి.

పురోగతి లేని పర్యాటక ప్రాజెక్టులు
పిచ్చిమొక్కలతో నిండిన ఈట్‌ స్ట్రీట్‌ దుకాణ సముదాయం

టీడీపీ హయాంలో ఈట్‌ స్ట్రీట్‌, ట్రైబల్‌ హట్‌ పనులు ప్రారంభం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిలుపుదల

కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించని వైనం

మూడేళ్లయినా ముందుకు సాగని ప్రాజెక్టులు

పిచ్చి మొక్కలతో అధ్వానంగా దర్శనం


అరకులోయ, ఏప్రిల్‌ 4: అందాల అరకులోయలో పర్యాటక ప్రాజెక్టులు పడకేశాయి. తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన పనులు వైసీపీ అధికారంలోకి రాగానే అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈట్‌ స్ట్రీట్‌, ట్రైబల్‌ హట్‌, యాంఫీ థియేటర్‌ పనులు ముందుకు సాగక అధ్వానంగా, అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

ఐటీడీఏ అధికారులు మండలంలోని కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీకి చెందిన 18 ఎకరాలను పర్యాటకాభివృద్ధి కోసం ఏపీటీడీసీకి అప్పగించారు. రూ.5.5 కోట్లతో ట్రైబల్‌ హట్‌, రూ.2.2 కోట్లతో ఈట్‌ స్ట్రీట్‌ ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించి దాదాపు గోడల నిర్మాణం పూర్తి చేశారు. మరో వైపు యాంఫీ థియేటర్‌ పనులు ప్రారంభించారు. అయితే ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. సుమారు మూడేళ్లు కావస్తున్నా ఈ రెండు ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఈట్‌స్ట్రీట్‌, ట్రైబల్‌ హట్‌ పరిసరాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. మొదట చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. కాంట్రాక్టర్‌ కష్టపడి ఎట్టకేలకు ఇటీవల బిల్లులు మంజూరు చేయించుకున్నా ఆ తరువాత చేసే పనులకు బిల్లులు రావనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. పర్యాటక శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మిగతా పనులు కూడా అంతే..

మయూరి హిల్‌ రిసార్ట్స్‌లో రూ.70 లక్షలతో ఈత కొలను నిర్మాణానికి అప్పట్లో పనులు ప్రారంభించారు. అది కూడా అసంపూర్తిగానే  ఉంది. అనంతగిరి హిల్‌ రిసార్ట్స్‌, బొర్రా గుహల ప్రవేశం వద్ద చేపట్టిన రెస్టారెంట్‌, దుకాణ సముదాయాలు, టికెట్‌ కౌంటర్‌ భవనాలు, బొర్రా హోటల్‌ జంక్షన్‌ వద్ద పెద్దగెడ్డపై వంతెన నిర్మాణానికి సన్నాహాలు చేసినప్పటికీ అవి ప్రారంభానికి నోచుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పర్యాటక ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదు. అలాగే గతంలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను గాలికొదిలేయండంతో అసంపూర్తిగా ఉన్నాయి. దీనిపై ఏపీటీడీసీ ఇన్‌చార్జి ఈఈ సత్యనారాయణను వివరణ కోరగా.. మొదట్లో బిల్లులు మంజూరుకాక పనులు నిలిపివేసినప్పటికీ ప్రస్తుతం ఈట్‌స్ట్రీట్‌, ట్రైబల్‌ హట్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌ పనులు చేసినంత వరకు బిల్లులు చెల్లించామన్నారు. పనులు పునఃప్రారంభించాలని పలుమార్లు కాంట్రాక్టర్‌కు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో నోటీసు ఇచ్చామన్నారు. నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి టెండర్‌ రద్దు చేసి మిగిలిన పనులకు టెండర్లు పిలుస్తామని ఆయన పేర్కొన్నారు.


Read more