‘పట్నం ఆస్పత్రిలో కుంటుపడిన సదుపాయాలు

ABN , First Publish Date - 2022-11-17T01:06:22+05:30 IST

స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో మౌలిక సదుపాయల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. రెండు లిఫ్ట్‌లు రెండేళ్లుగా మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడు లేడు. రోగులు మెట్లు ఎక్కి పై అంతస్థులకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

‘పట్నం ఆస్పత్రిలో కుంటుపడిన సదుపాయాలు

రెండేళ్లుగా పని చేయని లిఫ్ట్‌లు

మెట్ల మీదుగా వెళ్లలేక రోగుల ఇక్కట్లు

ఓపీ ప్రదేశంలో విరిగిన స్టీలు కుర్చీలు

గంటల తరబడి నిల్చుంటున్న రోగులు

పూర్తిస్థాయిలో అందుబాటులో లేని వీల్‌ చైర్లు, స్ట్రెచర్లు

నర్సీపట్నం, నవంబరు 16: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో మౌలిక సదుపాయల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. రెండు లిఫ్ట్‌లు రెండేళ్లుగా మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడు లేడు. రోగులు మెట్లు ఎక్కి పై అంతస్థులకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులకు ఆస్పత్రిలోని మొదటి అంతస్థులోమేల్‌, ఫిమేల్‌ వార్డులు, రెండో అంతస్థులో కళ్ల ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ, మేల్‌, ఫిమేల్‌ జనరల్‌ వార్డులు ఉన్నాయి. రోగులు, వైద్యుల కోసం వేర్వేరుగా గతంలో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం ఇవి మరమ్మతులకు గురయ్యాయి. దీంతో అందరూ మెట్ల మీదుగానే రాకపోకలు సాగించాల్సి వస్తున్నది. వైద్య విధాన పరిషత్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ ఇటీవల ఏరియా ఆస్పత్రి సందర్శించినప్పుడు లిఫ్ట్‌లు బాగుచేయించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఇదిలావుండగా ఆస్పత్రి వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులు వేచివుండేందుకు ఏర్పాటు చేసిన స్టీల్‌ బెంచీలు విరిగిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో ఓపీ విభాగంలో వైద్య పరీక్షల కోసం వస్తున్న రోగులు గంటల తరబడి నిలబడ లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి నిలబడే ఓపిక లేక నేల మీద కూలబడుతున్నారు. రోగులు నిత్యం ఇబ్బంది పడుతున్పటికీ బెంచీలను మాత్రం బాగు చేయించడంలేదు. ఇంకా స్ట్రెచర్లు, వీల్‌ చైర్లు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. కొన్నిసార్లు అత్యవసర విభాగం వద్ద రోగులకు వీల్‌ చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉండడం లేదు. అంబులెనుల్లో తీసుకువచ్చిన రోగులను వార్డులకు తరలించడానికి, అత్యవసర విభాగం వార్డు నుంచి జనరల్‌ వార్డుకు తరలించడానికి వీల్‌చైర్లు, స్ట్రెక్చర్లు అందుబాటులో లేక రోగులు, సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. కాగా పనిచేయని లిఫ్ట్‌లు, విరిగిన స్టీలు బెంచీలు, పాడైన వీల్‌చైర్లు, స్ర్టెచర్ల గురించి ఆస్పత్రి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పద్మవతిని వివరణ కోరగా.. వీల్‌ చైర్లు, స్ట్రెచర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-11-17T01:06:22+05:30 IST

Read more