మేడివాడ సంతలో నాటు కోళ్లకు గిరాకీ

ABN , First Publish Date - 2022-10-05T05:43:57+05:30 IST

మండలంలోని మేడివాడలో మంగళవారం జరిగిన సంతలో గొర్రెలు, మేకలు, నాటుకోళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి.

మేడివాడ సంతలో నాటు కోళ్లకు గిరాకీ

 సాధారణ రోజులతో పోలిస్తే 50 శాతం పెరిగిన ధరలు

దసరా పండుగ ఎఫెక్ట్‌

నాటుకోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోలుకు తరలివచ్చిన జనం

రావికమతం, అక్టోబరు 4: మండలంలోని మేడివాడలో మంగళవారం జరిగిన సంతలో గొర్రెలు, మేకలు, నాటుకోళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి జనం ఎగబడ్డారు. కొంతమంది అయితే మేడివాడ శివారులో ఇటు నర్సీపట్నం వైపు, అటు రావికమతం వైపు కాపు కాసి, సంతలో కోళ్లను అమ్మడానికి తీసుకువస్తున్న వారిని ఆపి మరీ కొనుగోలు చేశారు. దసరా పండుగ కావడంతో సాధారణ రోజులతోపోలిస్తే సుమారు 50 శాతం వరకు ధరలు పెరిగాయని అంటున్నారు. 

మండలంలోని మేడివాడ ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల మండలాల నుంచి పలువురు రైతులు గేదెలు, ఆవులను, జీవాల పెంపకందారులు గొర్రెలు, మేకలు, నాటుకోళ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కాగా బుధవారం దసరా పండుగ కావడంతో గొర్రెలు, మేకలు (పోతులు), నాటుకోళ్ల  అమ్మకందారులు, కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల మండలాలతోపాటు అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తదితర దూర ప్రాంతాల నుంచి దళారులు, వ్యాపారులు పోటెత్తారు. దీంతో గొర్రెలు, మేకలు, నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. సాధారణంగా కిలోన్నర బరువు వుండే నాటు కోడి రూ.600లకు లభిస్తుంది. కానీ ఈ వారం రూ.1,000 నుంచి రూ.1,200 పలికింది. మూడు కిలోల పుంజు అయితే రూ.2 వేలు పైబడి, నాలుగు కిలోల పుంజు రూ.3 వేలకు అమ్ముడుపోయాయి. గొర్రె పొట్టేళ్ల ధరలు కూడా బాగానే పెరిగాయి. సుమారు 20 కిలోల బరువున్న పొట్టేలు రూ.15,000 పలికింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పొట్లేళ్లను కొనుగోలు చేసి మినీవ్యాన్‌లో తరలించుకుపోయారు.  తమకు మంచి ఆదాయం లభించిందని అమ్మకం దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 


Read more