పెదబోదిగల్లం హైస్కూల్లో ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-17T06:18:02+05:30 IST

మండలంలోని పెదబోదిగల్లం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. తరగతి గదిలో శ్లాబ్‌ పెచ్చులతోపాటు సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా ఊడి కిందపడ్డాయి.

పెదబోదిగల్లం హైస్కూల్లో ప్రమాదం

శ్లాబ్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు, సీలింగ్‌ ఫ్యాన్‌

మధ్యాహ్న భోజన సమయంలో ఘటన

విద్యార్థులు ఆరుబయట ఉండడంతో తప్పిన ముప్పు


నక్కపల్లి, సెప్టెంబరు 16: మండలంలోని పెదబోదిగల్లం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. తరగతి గదిలో శ్లాబ్‌ పెచ్చులతోపాటు సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా ఊడి కిందపడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి ఆవరణలోకి వెళ్లడంతో ఎటువంటి ముప్పు వాటిల్లలేదు.

మండలంలోని పెదబోదిగల్లం జడ్పీ ఉన్నత పాఠశాలలో 80 మంది విద్యార్థులు వున్నారు. స్కూలు భవనాన్ని సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించారు. దీంతో అప్పుడప్పుడు శ్లాబ్‌ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షం కురిస్తే అక్కడక్కడా నీరు కారుతున్నది. ఈ నేపథ్యంలో గత ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో శ్లాబ్‌ పూర్తిగా నానిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేయడానికి ఆవరణలోకి వెళ్లారు. సుమారు ఒంటిగంట సమయంలో 8వ తరగతి గదిలో పెద్ద శబ్దంతో శ్లాబ్‌ పెచ్చులు ఊడి కిందకు పడ్డాయి. దీంతోపాటు సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా కింద పడిపోయింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు పరుగు పరుగున తరగతి గది వద్దకు వచ్చారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి విద్యాబోధన చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఉప విద్యాశాఖాధికారి జి.లక్ష్మణరావు, ఎంఈవో డీవీడీ ప్రసాద్‌, సర్పంచ్‌ షేక్‌ మున్నీసా బేగం పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పాఠశాలలో గతంలో కూడా శ్లాబ్‌ పెచ్చులూడి పడిపోయాయని, తాను ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని సర్పంచ్‌ ఆరోపించారు. 


Read more