నేతల రాతలు మారనున్నాయ్‌

ABN , First Publish Date - 2022-01-28T06:57:19+05:30 IST

ఉమ్మడి జిల్లాలో భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇప్పటివరకూ మైదాన, నగర ప్రాంత నాయకులే కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

నేతల రాతలు మారనున్నాయ్‌

కొత్త జిల్లాల ఏర్పాటుతో  రాజకీయ ముఖ చిత్రంలో మార్పు

అనకాపల్లికి జిల్లాయేతరుడు కానున్న శాసనసభ్యుడు గుడివాడ అమర్‌

వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాకు  మారక తప్పని పరిస్థితి

గండి బాబ్జీది అదే పరిస్థితి

జడ్పీలు, డీసీసీబీ,  డీసీసీఎంలు కూడా విభజన

కొత్త వారికి పదవులు

అల్లూరి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌గా సుభద్ర కొనసాగింపు

అనకాపల్లి జిల్లాకు కొత్త జడ్పీ చైర్మన్‌

విశాఖ జిల్లాలో మిగిలిన మూడు మండలాల పరిస్థితి ఏమిటో?


కొత్త జిల్లాల ఏర్పాటుతో విశాఖపట్నం జిల్లా మూడు ముక్కలు కానున్నది. దీంతో రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతోంది. ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆయా జిల్లాల్లో ప్రధాన సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ, ప్రభుత్వ పదవుల పంపకాలు, సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇప్పటివరకూ మైదాన, నగర ప్రాంత నాయకులే కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుకానుండడంతో నిర్ణయాలు ఇకపై గిరిజన నాయకులే తీసుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఏజెన్సీలో వైసీపీకి అరకులోయ ఎంపీ జి.మాధవి, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణుడు, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, దొన్నుదొర, ఎంవీవీ ప్రసాద్‌, సివేరి అబ్రహం వంటి వారు కీలకం కానున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు తరువాత వీరితోపాటు మరికొందరు

నాయకులు తయారయ్యే అవకాశం ఉంది.


అనకాపల్లి జిల్లా...

అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీలో ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్‌, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు కీలకంగా మారనున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ స్వస్థలమైన ‘మింది’ విశాఖ జిల్లాలో వుండడంతో ఆ జిల్లాకు నాన్‌లోకల్‌ అవుతారు. అందువల్ల ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు (నర్సీపట్నం, పెందుర్తి) రెండూ అనకాపల్లి జిల్లాలో విలీనం కానున్నాయి. వీరిద్దరితోపాటు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్‌ నేతలు పప్పల చలపతిరావు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పీలా గోవింద, బుద్ద నాగజగదీశ్వరరావు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. అనకాపల్లి జిల్లాలో కాపులు, వెలమలు, గవరలు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. ఈ మూడు సామాజిక వర్గాల్లో బలమైన, చొరవ కలిగిన నేతలకు అవకాశాలు దక్కనున్నాయి.  


విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లాకు వస్తే...అధికార పార్టీకి ఇద్దరే (పెందుర్తి, భీమిలి) శాసనసభ్యులు ఉంటారు. వీరిలో సీనియర్‌ అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జిగా వున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ నుంచే కార్యక్రమాలు నెరపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పెతకంశెట్టి గణబాబు, శ్రీభరత్‌ కీలకం కానున్నారు. కొత్తగా దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమితులైన గండి బాబ్జీ స్వస్థలం అనకాపల్లి జిల్లాలో కలవనున్నది. 


ఇద్దరు జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు

కొత్త జిల్లాల ఏర్పాటుతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వేర్వేరుగా జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ల నియామకం అనివార్యం కానున్నది. అల్లూరి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌గా సుభద్ర కొనసాగుతారు. అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి రిజర్వేషన్‌ ఖరారు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించినందున ఆలోగా...స్థానిక సంస్థల విభజన కూడా ఉంటుందా?, లేదా?...అనేది తేలాల్సి ఉంది. 

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు జడ్పీ, డీసీసీబీ చైర్మన్ల కాలపరిమితి రెండేళ్లు మాత్రమే వుండడంతో మార్పులు చేయలేదు. ఏపీలో జడ్పీ చైర్మన్లు ఎన్నికై ఇంకా ఆరు నెలలు కాకపోవడంతో స్థానిక సంస్థల విభజన కూడా వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీసీసీబీ చైర్‌పర్సన్‌గా వున్న చింతకాయల అనిత అనకాపల్లి జిల్లాకు చెందిన వారు కావడంతో అల్లూరి జిల్లాలో గిరిజనులకు అవకాశం లభించనున్నది. అలాగే ప్రస్తుతం డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌గా గాజువాకకు చెందిన చినతల్లి ఉన్నారు. ఆమె అనకాపల్లి జిల్లాకు స్థానికేతరురాలు అవుతారు. అప్పుడు రెండు (అనకాపల్లి, అల్లూరి) జిల్లాలకు కొత్త వారిని చైర్మన్‌లుగా నియమించవలసి ఉంటుంది. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రస్తుత చైర్‌పర్సన్‌ కొండా రమాదేవి నగరవాసి. కొత్త జిల్లాలు వస్తే ఆమెను విశాఖ జిల్లాకు పరిమితం చేసి, మిగిలిన రెండు జిల్లాలకు కొత్త వారిని నియమించనున్నారు. 


విశాఖలో మూడు మండలాల మాటేమిటి?

విశాఖ జిల్లాలో భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాలకు మాత్రమే మండల పరిషత్‌ కార్యాలయాలు మిగులుతాయి. ఆ మండలాలకు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఈ మూడు మండలాలకు ప్రత్యేకించి జిల్లా పరిషత్‌ కార్యాలయం నిర్వహణ అనేది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వీటిని జీవీఎంసీలో విలీనం చేస్తారా? లేక అలాగే కొనసాగిస్తారా?...అనేది వేచిచూడాలి. 


Read more