-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » neeti teeruva-NGTS-AndhraPradesh
-
నీటి తీరువాపై కసరత్తు
ABN , First Publish Date - 2022-03-16T06:07:03+05:30 IST
ప్రభుత్వ పథకాలు పొందేందుకుగాను రైతులు నీటి తీరువా చెల్లించి వుండాలనే నిబంధనను తీసుకురానున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ పథకాలతో లింకు?
రెవెన్యూ సిబ్బందిప్రచారం
గ్రామాల వారీగా బకాయిల వివరాలు సేకరణ
త్వరలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శన
జిల్లాలో ఏటా తీరువా డిమాండ్ రూ.2 కోట్లు
బకాయిలు రూ.28 కోట్లు
జల వనరుల శాఖ పరిధిలో గల వనరుల నుంచి 2,94,964 ఎకరాలకు సాగునీరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పథకాలు పొందేందుకుగాను రైతులు నీటి తీరువా చెల్లించి వుండాలనే నిబంధనను తీసుకురానున్నట్టు ప్రచారం జరుగుతోంది. నీటి తీరువా చెల్లిస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని రెవెన్యూ సిబ్బంది చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. నెలాఖరులోగా రైతులకు డిమాండ్ నోటీసులు ఇచ్చి వసూళ్లు వేగవంతం చేయాలని ఉన్నతాధికారుల నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ గ్రామాల వారీగా నీటి తీరువా బకాయిల జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. కాలువలు, పెద్ద చెరువుల కింద పంటకు నాలుగు నెలలపాటు నీటి సరఫరా జరిగితే నీటి తీరువా చెల్లించాలి. ఒక పంటకు వరి అయితే ఎకరాకు రూ.100, చెరకు అయితే రూ.350 చెల్లించాలి.
జల వనరుల శాఖ కింద 2,94,964 ఎకరాలకు నీరు
జల వనరుల శాఖ పరిధిలో జిల్లాలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 2,94,964 ఎకరాలకు నీరు అందుతుంది. తాండవ భారీ ప్రాజెక్టు నుంచి 32,689 ఎకరాలకు, మధ్య తరహా ప్రాజెక్టులు రైవాడ నుంచి 15,344 ఎకరాలకు, కోనాం నుంచి 12,638 ఎకరాలకు, పెద్దేరు నుంచి 19,322 ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే 15 చిన్ననీటి పారుదల వనరుల నుంచి 12,092 ఎకరాలకు, 247 పెద్ద చెరువుల నుంచి 59,065 ఎకరాలకు, 105 చిన్న చెరువుల నుంచి 4,810 ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నారు. కాగా 197 పురాతన ఆనకట్టలు, గ్రోయిన్స్, ఓపెన్ హెడ్ చానల్స్ కింద 95,839 ఎకరాలు, మరో 657 చిన్న పురాతన ఆనకట్టలు, గ్రోయిన్స్, ఓపెన్ హెడ్ చానల్స్ కింద 43,165 ఎకరాలకు నీరు ఇస్తున్నారు. మొత్తం 2,94,964 ఎకరాల నుంచి ఏటా రూ.2 కోట్లు నీటి తీరువా వసూలు లక్ష్యంగా నిర్ణయించేవారు. అయితే చాలాకాలం నుంచి నీటి తీరువాపై రెవెన్యూ అధికారులు పెద్దగా దృష్టిసారించడం లేదు. రెవెన్యూ శాఖ అడగడం లేదని అత్యధికులు పన్ను కట్టడం లేదు. దీంతో ప్రతి ఏడాది లక్ష్యంలో 20 నుంచి 30 శాతం మాత్రమే వసూలవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు రూ.28 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఆదాయ వనరుల అన్వేషణలో వున్న రాష్ట్ర ప్రభుత్వం...నీటి తీరువా బకాయిలపై దృష్టిసారించింది. గ్రామాల వారీగా బకాయిల వివరాలు ఆన్లైన్లో నమోదుచేయాలని తహసీల్దార్లను ఆదేశించింది. ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సింది, గడచిన పదేళ్లలో బకాయిల వివరాలు రైతు పేరుతో ఆన్లైన్లో నమోదుచేయాలని వీఆర్వోలకు మండల రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నెలాఖరులోగా బకాయిలతోపాటు ప్రస్తుత ఏడాది పన్ను చెల్లించాల్సిందిగా రైతులకు డిమాండ్ నోటీసులు జారీచేస్తారు. ఇంకా బకాయిల వివరాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. బకాయిల వసూలుకు ప్రభుత్వ పథకాలతో లింకు పెట్టాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనాలు, పురుగుమందులు సబ్సిడీ కావాలనుకుంటే నీటి తీరువా బకాయిలు వుండకూడదనే నిబంధన తీసుకువస్తారని అంటున్నారు. అలాగే మిగిలిన పథకాలకూ నీటి తీరువా చెల్లింపును తప్పనిసరి చేస్తారని తమకు సమాచారం వచ్చిందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. దీనిని అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
పంచాయతీరాజ్ చెరువుల ఆయకట్టుకు నీటి తీరువా?
ఇప్పటివరకు జల వనరుల శాఖ నీరు సరఫరా చేసే భూములకు మాత్రమే పన్ను వసూలు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో గల చెరువుల కింద ఆయకట్టు నుంచి కూడా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో 2,779 పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చెరువుల కింద 79,258 ఎకరాలకు నీరు అందుతుంది. ఆయా చెరువుల వివరాలు సేకరించాలని జల వనరుల శాఖకు ప్రభుత్వం ఆదేశించింది.