ప్రశ్నపత్రం లీకేజీలో నారాయణ ప్రమేయం లేదు

ABN , First Publish Date - 2022-11-23T03:13:11+05:30 IST

పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు...

ప్రశ్నపత్రం లీకేజీలో నారాయణ ప్రమేయం లేదు

సుప్రీం సీనియర్‌ లాయర్‌ లూథ్రా వాదన

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌కు నెంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు తోసిపుచ్చారు. నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పిటిషనర్‌కు బెయిల్‌ ఇస్తూ మేజిస్ట్రేట్‌ ఇచ్చినవి తుది ఉత్తర్వులు కావు. మధ్యంతర ఉత్తర్వులపై పోలీసులు వేసిన రివిజన్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు లోగడ ఇచ్చిన పలు తీర్పులు ఉన్నాయి. పిటిషనర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ నిర్వచనం కిందికి రారు. పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌ 409 వర్తించదు. 41ఏ నోటీసు ఇవ్వకుండా తప్పించుకునేందుకు సెక్షన్‌ 409 కింద కేసులు పెట్టడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ప్రాసిక్యూషన్‌ వాదనలు వినకుండా మేజిస్ట్రేట్‌ నిర్ణయం తీసుకున్నారని జిల్లా సెషన్స్‌ జడ్జి బెయిల్‌ రద్దు చేయడం సరికాదు. విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హాజరుకాకపోవడంతో ప్రాసిక్యూషన్‌ ఉంచిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని మేజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇచ్చారు. పిటిషన్‌ కాపీలను పోలీసులు పీపీకి అందజేశారు. విచారణకు హాజరుకానందుకు సంబంధిత పీపీపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నారాయణ ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌గా 2014లోనే పిటిషనర్‌ రాజీనామా చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చిన అనంతరం నిర్దిష్ఠ గడువు ముగిసిన తర్వాత కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరలేరు. దర్యాప్తుకి సహకరించేందుకు పిటిషనర్‌ సిద్ధం. సెషన్స్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలి’’ అని అన్నారు. ప్రభుత్వం తరఫున అడిషనల్‌ ఏజీ వాదనలు వినిపిస్తారని అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో విచారణ బుధవారానికి వాయిదా పడింది.

రిజిస్ట్రీ అభ్యంతరం

సెషన్స్‌ జడ్జి ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నారాయణ హైకోర్టును కోరారు. అయితే, సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయాలి తప్ప క్వాష్‌ పిటిషన్‌ వేయడానికి వీల్లేదని ఈ పిటిషన్‌పై రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తారు.

Updated Date - 2022-11-23T03:13:25+05:30 IST

Read more