నాడు- నేడు.. నాణ్యత కరువు

ABN , First Publish Date - 2022-11-30T01:06:08+05:30 IST

‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేస్తాం. మన బడి నాడు- నేడు కింద అభివృద్ధి చేస్తాం’.. తరచూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పే మాటలివి. అయితే నాడు- నేడు కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తోందన్న విమర్శలున్నాయి. స్థానిక రాజేంద్రపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ నెల రోజులకే మూలకు చేరడమే దీనికి నిదర్శనం.

నాడు- నేడు.. నాణ్యత కరువు
ప్రారంభించిన నెల రోజులకే మూలకు చేరిన ఆర్వో ప్లాంటు

- రాజేంద్రపాలెం ప్రాథమిక పాఠశాలలో నెల రోజులకే మూలకు చేరిన ఆర్వో ప్లాంటు

- విద్యార్థులకు తప్పని మంచినీటి కష్టాలు

- మన బడి నాడు- నేడు కింద చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపం

- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

కొయ్యూరు, నవంబరు 29: ‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేస్తాం. మన బడి నాడు- నేడు కింద అభివృద్ధి చేస్తాం’.. తరచూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పే మాటలివి. అయితే నాడు- నేడు కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తోందన్న విమర్శలున్నాయి. స్థానిక రాజేంద్రపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ నెల రోజులకే మూలకు చేరడమే దీనికి నిదర్శనం.

రాజేంద్రపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2020 అక్టోబరులో తొలి విడత నాడు- నేడు కింద రూ.22 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రూ.12 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, రన్నింగ్‌ వాటర్‌ తదితర పనులు చేశారు. రూ.6 లక్షలతో 1000 లీటర్ల సామర్థ్యం గల ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మిగతా నిధులతో సిమెంట్‌ పనులు, ఇతర సామగ్రి సరఫరా చేశారు.

నెల రోజులకే మూలకు చేరిన ఆర్వో ప్లాంట్‌

2020 అక్టోబరు నెల చివరిలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ ఆ మరుసటి నెల రెండో వారం వరకు పని చేసి ఆ తరువాత మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి దీనిని వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పలుమార్లు కోరినా ఇప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో 175 మంది విద్యార్థులు చదువుతుండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 155 మందికి దిగజారింది. ఈ విద్యార్థులందరికీ ఆర్వో ప్లాంట్‌ నీరే దిక్కు. అయితే ఇది మరమ్మతులకు గురికావడంతో విద్యార్థులు మంచినీటి బోరు నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే పాఠశాల నిర్వహణకు రెండు పక్కా భవనాలతో పాటు మరో రెండు రేకులషెడ్లు ఉన్నాయి. అదనపు వసతికి గానూ రూ.22 లక్షలు మంజూరు కాగా, ఇక్కడ ఉన్న కొద్దిపాటి ఆట స్థలంలోనే వాటిని నిర్మిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆట స్థలం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అదనపు వసతి భవన నిర్మాణాలకు వీలుగా పాఠశాలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంతో పాటు నెలరోజులకే మూలకు చేరిన ఆర్వో ప్లాంట్‌ను తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

-----

పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు (ఫొటో- 22 కెవైఆర్‌ 5)

పాఠశాలలో ప్రారంభించిన నెల రోజులకే ఆర్వో ప్లాంటు మరమ్మతులకు గురై మూలకు చేరింది. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితం అప్పటి గిరిజన సంక్షేమశాఖ జేఈ సుబ్బారావు దృష్టికి తీసుకు వెళ్లాను. ఆ తరువాత ఆయన బదిలీపై వెళ్లిపోయారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు.

- లోచల ఫణీంద్రుడు, ప్రధానోపాధ్యాయుడు

Updated Date - 2022-11-30T01:06:08+05:30 IST

Read more