నాడు- నేడు పనులపై వైసీపీ నేతల కన్ను

ABN , First Publish Date - 2022-04-24T06:16:31+05:30 IST

గత ఏడాది పాఠశాల పేరెంట్స్‌ కమిటీలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదిపి, తాము సిఫారసు చేసిన వారి పేర్లతో కమిటీలను ఏర్పాటు చేయించారు.

నాడు- నేడు పనులపై వైసీపీ నేతల కన్ను
నాడు- నేడు రెండో విడత అభివృద్ధి పనులకు ఎంపిక చేసిన ముత్రాస్‌కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాల

- పేరెంట్స్‌ కమిటీల ముసుగులో పెత్తనం

- పాఠశాలల వారీగా పంచుకుంటున్న అధికార పార్టీ నాయకులు

- అభివృద్ధి కమిటీలను డమ్మీగా మార్చేస్తున్న వైనం

- అధికారులకు ఫిర్యాదు చేస్తున్న హెచ్‌ఎంలునాడు- నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం పాఠశాలల్లో రెండో విడత చేపట్టనున్న పనులను బినామీల మాటున అధికార పార్టీ నేతలు సొంతం చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాల పేరెంట్స్‌ కమిటీ, ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణలో పనులు జరగాలి. అయితే స్థానిక నాయకులు.. నాడు- నేడు పనులను తామే చేస్తామని పట్టుబట్టడంతో హెచ్‌ఎంలు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. 

-----


(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

గత ఏడాది పాఠశాల పేరెంట్స్‌ కమిటీలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదిపి, తాము సిఫారసు చేసిన వారి పేర్లతో కమిటీలను ఏర్పాటు చేయించారు. జిల్లాలో 90 శాతానికిపైగా పాఠశాలల కమిటీల చైర్మన్లు వైసీపీ మద్దతుదారులన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి విడత నాడు- నేడు పనులను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్లు పంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులను, ఇతర అధికారులను నామమాత్రం చేశారు. కొన్నిచోట్ల కమిటీ చైర్మన్లే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. మరికొన్నిచోట్ల పనులను బయట వ్యక్తులకు అమ్ముకున్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేయాల్సిన పనులను బయట వ్యక్తులతో ఎలా చేయిస్తున్నారని కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అభ్యంతరం తెలిపినా ఫలితం లేకుండా పోయింది. పేరెంట్స్‌ కమిటీ, స్థానిక నాయకులు కలిసి ప్రధానోపాధ్యాయులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అనకాపల్లి మండలం కొండకొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.54 లక్షలు కేటాయించారు. ఈ పనులను తామే చేయిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేయడంతో ఉన్నతాధికారులకు హెచ్‌ఎం ఫిర్యాదు చేశారు. మునగపాక మండలం తిమ్మరాజుపేట జడ్పీ హైస్కూల్‌లో తొలివిడత నాడు- నేడు పనులు అసంపూర్తిగా మిగిలాయి. ప్రహరీ గోడ, పాఠశాల ముఖద్వారం నిర్మాణ పనులు పూర్తి చేయలేదు.  

పనులపై కన్నేసిన వైసీపీ నాయకులు

 నాడు- నేడు పథకం కింద అనకాపల్లి జిల్లాలో రెండో విడత పాఠశాలల అభివృద్ధికి రూ.83 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో 396 ప్రాథమిక పాఠశాలు, 32 ప్రాథమికోన్నత పాఠశాలలు, 270 ఉన్నత పాఠశాలలు.. మొత్తం 687 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు పరిపాలన పరమైన ఆమోదం లభించింది. ఇటీవల కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి రెండో దశ పనులు వేగవంతం చేయాలని అధికారుల సమీక్ష సమావేశంలో ఆదేశించారు. నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించడంతో ఈ పనులపై వైసీపీ నేతలు కన్నేశారు. వాస్తవంగా ఈ పనులను పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలి. దీనిలో పాఠశాల పేరెంట్స్‌ కమిటీ, ప్రధానోపాధ్యాయుడు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, సంక్షేమ సహాయకుడు, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌తోపాటు పిల్లల తల్లిదండ్రులు ఐదుగురు ఉంటారు. కానీ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సూచించిన వ్యక్తి మాత్రమే నాడు- నేడు పనులు చేపట్టేలా పావులు కదిపారు. పేరెంట్స్‌ కమిటీల ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు, సానుభూతిపరులు నాడు- నేడు పనులు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తాము చెప్పిన వారితోనే పనులు చేయించాలని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధికారులను మౌఖికంగా ఆదేశిస్తున్నట్టు తెలిసింది. 


Read more