కైలాసపురంలో వృద్ధుడి హత్య

ABN , First Publish Date - 2022-10-04T07:47:49+05:30 IST

వాహనాలు అడ్డుగా పెట్టారనే చిన్నపాటి వాగ్వాదంతో మొదలైన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారితీసింది.

కైలాసపురంలో వృద్ధుడి హత్య
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు, కుటుంబ సభ్యులు

సీతంపేట, అక్టోబరు 3: వాహనాలు అడ్డుగా పెట్టారనే చిన్నపాటి వాగ్వాదంతో మొదలైన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారితీసింది.  కైలాసపురంలో   నడి రోడ్డుపై పట్టపగలు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...కైలాసపురానికి చెందిన నారాయణరావు తన కుంటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో కారు డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌  నివాసం ఉంటున్నాడు. దుర్గాప్రసాద్‌ నిత్యం తన వాహనాన్ని తీసుకువచ్చి ఎక్కడబడితే అక్కడ పార్కింగ్‌ చేసి స్థానికులకు ఇబ్బందులు పెడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పూటుగా మద్యం తాగిన దుర్గాప్రసాద్‌ తన వాహనాన్ని తీసుకువచ్చి కైలాసపురంలో నారాయణరావు(76) ఇంటి వద్ద ఉన్న వాహనాలకు అడ్డుగా పెట్టాడు. దీంతో నారాయణరావు కుమారుడు గోపి ఇలా అడ్డుగా వాహనాల ముందు పెట్టడం సబబు కాదని దుర్గాప్రసాద్‌కి చెప్పాడు. దీంతో దుర్గాప్రసాద్‌ గోపితో గొడవపడి తిడుతూ దౌర్జన్యానికి దిగాడు. ఈసమయంలో అక్కడికి వచ్చిన గోపి తండ్రి నారాయణరావు ఎందుకు గొడవ అని వారిస్తూ, వాహనం అడ్డుగా పెట్టకూడదని అన్నాడు. దీంతో దుర్గాప్రసాద్‌ కోపంతో నారాయణరావుని ముఖంపై, గుండెపై పిడి గుద్దులతో కొట్టి తోసివేశాడు. దీంతో నారాయణరావు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్యులు వచ్చి పరిశీలించి, నారాయణరావు మృతి చెందినట్టు నిర్ధారించారు. పారిపోతున్న నిందితుడు దుర్గాప్రసాద్‌ని స్థానికులు పట్టుకొని నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి విచ్చేసిన ఏసీపీ హర్షిత, సీఐ శ్రీనివాసరావులు విచారణ నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్‌ని బ్రీత్‌ ఎన్‌లైజర్‌తో పరీక్షిస్లే 521కి పైగా రీడింగ్‌ వచ్చింది. అనంతరం నిందితుడు దుర్గాప్రసాద్‌ని అరెస్టు చేశారు.  మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. 

Read more