‘ఉక్కు’ పరిరక్షణకు ఉద్యమాలను ఉధృతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-25T06:21:39+05:30 IST

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే దీనిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ ప్రశ్నించారు.

‘ఉక్కు’ పరిరక్షణకు ఉద్యమాలను ఉధృతం చేయాలి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి రాజశేఖర్‌

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ 

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 24: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే దీనిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ ప్రశ్నించారు. ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు కార్మికులంతా ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 590వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ వందలాది రోజులుగా వివిధ రూపాలలో నిరసనలు, బంద్‌లు, రాస్తారోకోలు, ఐక్య ఉద్యమాలతోనైనా కేంద్రానికి కనువిప్పు కలుగుతుందని ఆశించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఉక్కు కర్మాగారం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా అప్పుల ఊబిలోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు చేస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేఎస్‌ఎన్‌ రావు, అయోధ్యరామ్‌, వరసాల శ్రీనివాసరావు, జె.రామకృష్ణ, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, గంధం వెంకటరావు, మస్తానప్ప, రమణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T06:21:39+05:30 IST