మోదీని సాగనంపాలి

ABN , First Publish Date - 2022-09-27T07:06:38+05:30 IST

దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని సాగనంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

మోదీని సాగనంపాలి
సభలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు


కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తున్నారు

అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే

వైసీపీ శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తోంది

ఉత్తరాంధ్రకు జగన్‌ అన్యాయం

మూడేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో మంత్రులు చెప్పాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 26: దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని సాగనంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ‘దేశ రక్షణ భేరి’ కార్యక్రమంలో భాగంగా సీపీఎం నాయకులు సోమవారం పట్టణంలోని రింగ్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, పైగా ఆర్థిక భారాలు మోపారని దుయ్యబట్టారు. దేశంలో ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లచే కొనుగోలు చేయించేందుకు కేంద్రం యత్నిస్తుందని, అదేగనుక జరిగితే రైతుకు గిట్టుబాటు ధర రాదన్నారు.

దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్రమోదీ కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో 30 వేల మంది పనిచేసే విశాఖ ఉక్కును దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి విక్రయించేందుకు కుట్ర పన్నారని, దీనిని వ్యతిరేకిస్తూ వేలాది మంది కార్మికులు ఆందోళనలు సాగిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెండు చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని విమర్శించారు. నల్లబెల్లం పేరుతో వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు ఆరోపించారు. కోర్టు అనుమతి ఇచ్చిన తరువాత ఆపడానికి మీరెవ్వరంటూ ధ్వజమెత్తారు. అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేశారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఈ ప్రాంత మంత్రులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని ప్రకటనలు చేసిన సీఎం జగన్‌...22 మంది ఎంపీలను ఇచ్చినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదన్నారు. ఢిల్లీలో నాడు ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడితే ప్రస్తుత నేతలు కేంద్రానికి తలపుతున్నారని దుయ్యబట్టారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. విశాఖకు రైల్వేజోన్‌ ఇస్తామని ప్రకటించిన మోదీ...జోన్‌ సంగతేమో కానీ, ఉన్న డివిజన్‌ను కూడా ఎత్తేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు వత్తాసు పలుకుతుందే తప్ప బడుగు బలహీన వర్గాల ఉన్నతికి చేసిందేమీ లేదని శ్రీనివాసరావు విమర్శించారు. సభలో పార్టీ నాయకులు కె.లోకనాథం, ఎ.బాలకృష్ణ, గంటా శ్రీరామ్‌, మళ్ల సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, వీవీ శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T07:06:38+05:30 IST