ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ర్యాలీ

ABN , First Publish Date - 2022-10-08T06:16:40+05:30 IST

పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అత్యంత వెనుకబడిన గిరిజన తెగల(పీవీటీజీలు) పట్ల వివక్ష చూపుతున్నారని స్థానిక మాజీ ఎంపీపీ వంతల బాబూరావు ఆరోపించారు.

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ర్యాలీ
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎంపీపీ బాబూరావు, డీసీసీ అధ్యక్షుడు సుబ్బారావు, పీవీటీజీలు

పీవీటీజీలపట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపణ

సొంత పార్టీ వారే పదవి నుంచి దించేశారని మాజీ ఎంపీపీ బాబూరావు ఆవేదన

భవిష్యత్తులో వైసీపీ పెద్దలు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక

చింతపల్లి, అక్టోబరు 7: పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అత్యంత వెనుకబడిన గిరిజన తెగల(పీవీటీజీలు) పట్ల వివక్ష చూపుతున్నారని స్థానిక మాజీ ఎంపీపీ వంతల బాబూరావు ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏజెన్సీలోని వివిధ మండలాల నుంచి పీవీటీజీలు చింతపల్లి తరలివచ్చి హనుమాన్‌ జంక్షన్‌ నుంచి సంతబయలు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పీవీటీజీల ఐక్యత వర్ధిల్లాలి, పీవీటీజీలపట్ల వివక్ష చూపుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి డౌన్‌ డౌన్‌, బాబూరావుకు తిరిగి ఎంపీపీ పదవి  ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాబూరావు మాట్లాడుతూ, సొంత పార్టీకి చెందిన వారే కక్షపూరితంగా తనను పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. పీవీటీజీలు ఎంపీపీగా వుండకూదనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేశ్‌ గిరిజనేతరుడని రుజువైనప్పటికీ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అతని పదవి పోకుండా కాపాడారని ఆరోపించారు. వారికో న్యాయం, పీవీటీజీ అయిన తనకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై పీవీటీజీలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో వైసీపీ పెద్దలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వంతల సుబ్బారావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T06:16:40+05:30 IST