-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Mix Pendurthi in Visakhapatnam district-NGTS-AndhraPradesh
-
విశాఖ జిల్లాలో ‘పెందుర్తి’ని కలపాలి
ABN , First Publish Date - 2022-02-23T05:57:24+05:30 IST
పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.

అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
25 నుంచి 27 వరకు పెందుర్తి కూడలిలో రిలే నిరాహార దీక్షలు: టీడీపీ సీనియర్ నేత ‘బండారు’
సింహాచలం, ఫిబ్రవరి 22: పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన మంగళవారం సింహాచలం గోశాల కూడలిలోని ఎస్‌ఎన్‌ఆర్ కల్యాణ మండపంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో కలపడాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజాభీష్టం మేరకు ‘పెందుర్తి’ని విశాఖ జిల్లాలోనే వుంచాలని కోరుతూ ఈ నెల 25 నుంచి ప్రత్యక్ష పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో పెందుర్తి కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. అలాగే 27న పెందుర్తి కూడలి నుంచి నియోజకవర్గ సరిహద్దు అయిన వేపగుంటలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం జిల్లాల పునర్విభజనపై ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తున్నారని బండారు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి వద్ద నర్సీపట్నం ఎమ్మెల్యే ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పటికీ పెందుర్తి ఎమ్మెల్యే ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశాఖ శారదాపీఠంగా పేరొందిన పీఠం పేరును స్వరూపానందేంద్ర సరస్వతి అనకాపల్లి శారదాపీఠంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై శారదా పీఠాధిపతి ముఖ్యమంత్రిని కలిసి ప్రజల పక్షాన మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ‘పెందుర్తి’ని కలపడం వల్ల న్యాయపరమైన, భౌగోళిక సమస్యలను ప్రజలు ఎదుర్కొనాల్సి వస్తుందని బండారు సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కోన మంగయ్యనాయుడు, నాయకుడు గొర్లె రామునాయుడు, కాంగ్రెస్ నాయకుడు షేక్ షఫీ, సీపీఐ తరపున ఆర్.శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ నుంచి మువ్వల రమణ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, కార్పొరేటర్లు పీవీ నరసింహం, బల్ల శ్రీనివాసరావు, రాపర్తి కన్నా, మొల్లు ముత్యాలనాయుడు, రౌతు శ్రీనివాసరావు, తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడ శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.