మేయర్‌ వర్సెస్‌ డిప్యూటీ మేయర్లు

ABN , First Publish Date - 2022-11-30T23:47:39+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని అన్ని విభాగాల అధిపతులతో మంగళవారం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో కమిషనర్‌ ఏర్పాటుచేసిన ‘వర్క్‌షాప్‌’ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి, డిప్యూటీ మేయర్‌లు జియ్యాని శ్రీధర్‌, కటుమూరి శ్రీధర్‌కు నడుమ చిచ్చురేపింది. వర్క్‌షాప్‌కు మేయర్‌ హాజరై...తమను ఆహ్వానించకపోవడాన్ని వారిద్దరూ తప్పుబడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయంటూ...మేయర్‌ వ్యవహారశైలిని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

మేయర్‌ వర్సెస్‌ డిప్యూటీ మేయర్లు

చిచ్చురేపిన వర్క్‌షాప్‌

‘రాడిసన్‌ బ్లూ’లో సమావేశానికి తమను ఎందుకు ఆహ్వానించలేదని నిలదీసిన శ్రీధర్‌, సతీష్‌

అసలు ఉచితంగా ఎందుకు సమకూర్చిందని నిలదీత

ఆస్తిపన్ను తగ్గింపు కోసమేనని ఆరోపణ

పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని అన్ని విభాగాల అధిపతులతో మంగళవారం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో కమిషనర్‌ ఏర్పాటుచేసిన ‘వర్క్‌షాప్‌’ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి, డిప్యూటీ మేయర్‌లు జియ్యాని శ్రీధర్‌, కటుమూరి శ్రీధర్‌కు నడుమ చిచ్చురేపింది. వర్క్‌షాప్‌కు మేయర్‌ హాజరై...తమను ఆహ్వానించకపోవడాన్ని వారిద్దరూ తప్పుబడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయంటూ...మేయర్‌ వ్యవహారశైలిని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

జీవీఎంసీలోని అన్ని విభాగాల అధిపతులతో కమిషనర్‌ పి.రాజాబాబు భీమిలి బీచ్‌రోడ్డులో గల రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మంగళవారం రాత్రి వర్క్‌షాప్‌ ఏర్పాటుచేశారు. దీనికి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి హాజరయ్యారు. అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకున్న తర్వాత రాత్రి విందు ఏర్పాటుచేశారు. దీనికి డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌తోపాటు కటుమూరి సతీష్‌కు ఆహ్వానం అందలేదు. ఈ విషయమై మేయర్‌ భర్త శ్రీనివాసరావుకు ఇద్దరూ ఫోన్‌ చేసి తమ అసంతృప్తిని వ్యక్తంచేయగా కార్యక్రమం కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిందని, మేయర్‌ను కేవలం అతిథిగా ఆహ్వానించడంతో తాము ఎవరికీ సమాచారం ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ వారిద్దరూ సంతృప్తి చెందలేదని తెలిసింది. బెంగళూరులో వున్న కటుమూరి సతీష్‌ బుధవారం ఉదయం మరోసారి ఇదే విషయాన్ని ఫోన్‌లో మేయర్‌ భర్త శ్రీనివాసరావుతోపాటు వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా సతీష్‌కు, శ్రీనివాసరావుకు మధ్య వాదన జరిగినట్టు తెలిసింది. గతంలో జోనల్‌ కమిషనర్లకు కొత్త బొలేరో వాహనాలను అందజేసినప్పుడు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మేయర్‌ మాత్రమే హాజరయ్యారని, తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, అంతకుముందు పారిశుధ్య నిర్వహణ యంత్రాల ప్రారంభానికి కూడా అలాగే చేశారని ఇద్దరు డిప్యూటీ మేయర్లు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. తరచూ ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నందున విషయాన్ని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయినా...వర్క్‌షాప్‌ నిర్వహించాలనుకుంటే జీవీఎంసీలో పాత సమావేశ మందిరం ఉందని, అక్కడ కాదనుకుంటే వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనా వంటి అత్యాధునిక ఆడిటోరియాలు అందుబాటులో ఉన్నాయని...వాటన్నింటినీ కాకుండా నగరానికి శివారున వున్న అత్యంత ఖరీదైన సెవెన్‌స్ఠార్‌ హోటల్‌లో వర్క్‌షాప్‌ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు వైసీపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేక, అభివృద్ధి పనులు చేపట్టలేక జీవీఎంసీ సతమతమవుతుంటే ఆ విషయాన్ని విస్మరించి డబ్బులు దుబారా చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై మేయర్‌ను తాము ప్రశ్నిస్తే హోటల్‌ యాజమాన్యం ఉచితంగానే అన్నీ సమకూర్చిందని, ఒక్క రూపాయి కూడా బిల్లు వేయలేదని సమాధానం ఇస్తున్నారని, ఎందుకు ఉచితంగా ఇచ్చిందో కూడా బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. హోటల్‌కు సంబంధించిన ఆస్తి పన్నును తగ్గించాలంటూ కొద్దినెలలుగా యాజమాన్య ప్రతినిధులు జీవీఎంసీ చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పుడు వర్క్‌షాప్‌కు ఉచితంగా అవకాశం ఇచ్చి, తమ ప్రయోజనం నెరవేర్చుకుంటారనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అసలు హోటల్‌ ఎంత విస్తీర్ణంలో ఉంది?, దానికి ప్రస్తుతం ఎంత పన్ను చెల్లిస్తున్నారనేది? అధికారులు బయటపెట్టాలని, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని సవాల్‌ చేస్తున్నారు. ఏదిఏమైనా రాడిసన్‌బ్లూ హోటల్‌లో జరిగిన వర్క్‌షాప్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్ల మధ్య విభేదాలను బట్టబయలు చేసిందని వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, అధికారులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-11-30T23:47:41+05:30 IST