అల్లూరి స్ఫూర్తితో మన్యం అభివృద్ధి కృషి

ABN , First Publish Date - 2022-07-05T06:35:38+05:30 IST

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మన్యం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

అల్లూరి స్ఫూర్తితో మన్యం అభివృద్ధి కృషి
పాడేరు కలెక్టరేట్‌లో అల్లూరి విగ్రహావిష్కరణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి అమర్‌నాథ్‌, పక్కన అల్లూరి విగ్రహం

రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

పాడేరు కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ 


పాడేరు, జూలై 4:(ఆంధ్రజ్యోతి): విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మన్యం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి పేరిట గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం విశేషమని, అందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు జిల్లా స్థాయి అధికారులను కలుసుకోవడం గిరిజనులకు కలగానే ఉండేదని, కొత్త జిల్లా ఏర్పాటుతో గిరిజనుల చెంతే జిల్లా అఽధికారులు ఉన్నారన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరుగుతున్నదని, త్వరలోనే మెడికల్‌ కాలేజీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగ నాగార్జున మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి చొరవతో రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం ద్వారా లక్షలాది మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నాటికి అల్లూరి విగ్రహం చెంత ఆయన అనుచరులైన గాం గంటందొర, గాం మల్లుదొరల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకులోయ ఎంపీ జి.మాధవి, ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, జిల్లా ఎస్‌పీ ఎస్‌.సతీశ్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, డీఆర్‌వో బి.దయానిధి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T06:35:38+05:30 IST