మహానాడు వేదిక మార్పు!

ABN , First Publish Date - 2022-06-12T06:27:28+05:30 IST

నియోజకవర్గ కేంద్రం చోడవరంలో ఈనెల 15న జరగనున్న మినీ మహానాడు వేదికకు ప్రత్నామ్యాయ వేదిక ఏర్పాట్లలో టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారు.

మహానాడు వేదిక మార్పు!
మినీ మహానాడు నిర్వహణ కోసం ప్రత్నామ్యాయ వేదికను పరిశీలిస్తున్న మాజీ మంత్రి అయ్యన్న, ఎమ్మెల్సీలు

 - అనుమతికి అవకాశాలు కనిపించక పోవడంతో  ప్రత్నామ్యాయ వేదిక సిద్ధం చేస్తున్న టీడీపీ నాయకులు

-  మరో రెండు స్థలాల పరిశీలన

- కొత్తూరు పెట్రోల్‌ బంకు సమీపంలో వాహనాల పార్కింగ్‌

- మల్లునాయుడు స్థలంలో వేదిక ఏర్పాటు నిర్ణయంలో నేతలు


చోడవరం, జూన్‌ 11 : నియోజకవర్గ కేంద్రం చోడవరంలో ఈనెల 15న జరగనున్న మినీ మహానాడు వేదికకు ప్రత్నామ్యాయ వేదిక ఏర్పాట్లలో టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారు. మినీ మహానాడు వేదిక నిర్వహణ కోసం శుక్రవారం మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర నేతలు పట్టణంలోని పలు స్థలాలను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ హైస్కూల్‌ మైదానంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం కలెక్టర్‌కు అనుమతి కోరాలని నిర్ణయించారు. అయితే  హైస్కూల్‌ మైదానంలో అనుమతి కోసం ప్రయత్నించినా అధికారులు, పోలీసు యంత్రాంగం నుంచి అనుమతి వచ్చే అవకాశాలు కనిపించలేదని భావించి, శనివారం మరోసారి మాజీ మంత్రి అయ్యన్న, ఎమ్మెల్సీలు పి.అశోక్‌బాబు, మంతెన సత్యనారాయణరాజు,  మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు తదితరులు మరో రెండు స్థలాలను పరిశీలించారు. చివరకు కొత్తూరు పెట్రోల్‌ బంకు సమీపంలో ఓ ప్రైవేటు స్థలంలో వాహనాల పార్కింగ్‌కు, టీడీపీ నాయకుడు గూనూరు మల్లునాయుడుకు చెందిన స్థలంలో మినీ మహానాడు వేదిక ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి నేతలు వచ్చారు. చంద్రబాబునాయుడు వచ్చే దారి కోసం నాయకులు పరిశీలన జరిపారు. సభకు హాజరయ్యే శ్రేణులు సులభంగా సభావేదిక వద్దకు వచ్చేలా చర్యలు చేపట్టాలని అయ్యన్న, ఎమ్మెల్సీలు స్థానిక నేతలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బత్తుల తాతయ్యబాబులకు  సూచించారు.  మినీ మహానాడుకు భారీగా శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ మల్లు నాయుడుతో పాటు, పార్టీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి గూనూరు లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్స్యరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 


 వేదిక అనుమతిపై సమాధానం కరువు

చోడవరంలో మినీ మహానాడు వేదిక అనుమతి కోసం ప్రయత్నిస్తే, ఈ ప్రభుత్వంలో కనీస సమాధానం చెప్పే నాథుడు లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఒంగోలు మహానాడుతో పాటు, ఇతర జిల్లాల్లో సభలకు కూడా అనుమతి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చోడవరం ప్రభుత్వ హైస్కూల్‌ మైదానంలో మహానాడు వేదిక  కోసం అనుమతికి తమ నాయకులు వెళితే, కనీసం కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు.  ఇక పోలీసులతో పాటు, స్థానిక అధికారులు కూడా సభకు అనుమతి రావడం కష్టమేనన్న ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా... అనే అనుమానం వ్యక్తమవుతోందని అశోక్‌బాబు విమర్శించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. మినీ మహానాడు నిర్వహించి తీరుతామని స్పష్టం చే శారు. 


Updated Date - 2022-06-12T06:27:28+05:30 IST