5న అల్పపీడనం... 7న వాయుగుండం

ABN , First Publish Date - 2022-12-02T04:20:07+05:30 IST

పసిఫిక్‌ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్‌ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.

5న అల్పపీడనం... 7న వాయుగుండం

8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

విశాఖపట్నం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పసిఫిక్‌ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్‌ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే మూడు తుఫాన్ల అవశేషాలు అండమాన్‌లోకి రాగా... తాజాగా మరొకటి రానుంది. థాయ్‌లాండ్‌లో తీ రం దాటి బలహీనపడిన తుఫాన్‌ నుంచి అవశేషంగా మిగిలిన ఉపరితల ఆవర్తనం ఈ నెల 4న దక్షిణ అండమాన్‌లో ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 5న దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం 8వ తేదీ కల్లా తమిళనాడు, పుదుచ్చేరి తీరం దిశగా రానుంది. దీని ప్రభావంతో 8, 9వ తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కోస్తాలో గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వరి కోతలు సాగుతుండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాల సమాచారం కోసం రై తులు విశాఖలోని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేస్తున్నారు. అయితే 5న అల్పపీడనం ఏర్పడిన తరువాత దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు వివరిస్తున్నారు. కాగా, తూర్పుగాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తా, సీమల్లో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఫిబ్రవరి వరకూ గజగజ

రాష్ట్రంలో డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3నెలల కాలానికి ఐఎండీ గురువారం బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం దక్షిణ, మధ్య, వాయవ్య భారతంలోని కొన్ని చోట్ల చలి ఎక్కువగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు జార్ఖండ్‌, రాజస్థాన్‌లలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి.

Updated Date - 2022-12-02T04:20:07+05:30 IST