వరి రైతుకు నష్టం

ABN , First Publish Date - 2022-12-13T01:07:13+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో పలువురు వరి రైతులకు నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలుమార్లు మోస్తరు నుంచి భారీ వర్షం పడడంతో కుప్ప వేయని వరి పనలు తడిసిపోయాయి.

వరి రైతుకు నష్టం
ఎలమంచిలి మండలం సోమలింగపాలెంలో నీట మునిగిన వరి పనలను చూపుతున్న రైతు

2,500 ఎకరాలుగా వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా

నష్టపరిహారంపై ప్రభుత్వం నిబంధనలు

పంట కోయక ముందు నష్టం వాటిల్లితేనే పరిహారం చెల్లింపు

ప్రభుత్వ తీరుపై అన్నదాతలు నిరసన

పంట నష్టంపై 21 నాటికి నివేదిక ఇస్తామంటున్న అధికారులు

అనకాపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో పలువురు వరి రైతులకు నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలుమార్లు మోస్తరు నుంచి భారీ వర్షం పడడంతో కుప్ప వేయని వరి పనలు తడిసిపోయాయి. లోతట్టు భూముల్లో వరి పనలు నీటమునిగాయి. సోమవారం పగలు వర్షం పడకపోయినప్పటికీ ఆకాశం మేఘావృతంగా వుంది. దీంతో వరి పనలు ఆరడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. మంగళవారం వర్షం పడకుండా వాతావరణం పొడిగా వుంటే బుధవారం నుంచి వరి కోతలు చేపట్టవచ్చని వారు సూచిస్తున్నారు. కాగా జిల్లాలో సుమారు 2,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే మండలాల నుంచి క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ఐదు వేల ఎకరాలకు పైబడి వరి పంటకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది.

కోయని పంట దెబ్బ తింటేనే పరిహారం!

వరి పంట కోసిన తరువాత ప్రకృతివైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి పరిహారం అందదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొలంలో పంట (స్టాండింగ్‌ క్రాప్‌) వుండి, తుఫాన్లు, వరదలు, వర్షాలకు దెబ్బతింటేనే నష్టపరిహారం మంజూరు అవుతుందని చెప్పారు. తుఫాన్‌కు ముందు కోత కోసి, కుప్ప వేయని పొలాల్లో వరి పనలు పూర్తిగా తడిసిపోయాయి. ఇటువంటిచోట ధాన్యం రంగు మారే అవకాశం వుంది. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో వరి పనలు నీట మునిగి, ధాన్యం మొలకెత్తుతున్నదని బాధిత రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే జిల్లాలో ఒక్క రైతుకు కూడా బీమా పరిహారం లేదా పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందే పరిస్థితి లేదు.

పంట నష్టంపై 21 నాటికి నివేదిక

మాండస్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు జిల్లాలో ఏయే పంటలకు ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేసి ఈనెల 21వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత కోతకోయని వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, పంట నష్టం 50 శాతం కంటే ఎక్కువ ఉంటేనే నివేదికలో పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

1,053 ఎకరాల్లో తడిసిన వరి పనలు

ఎలమంచిలి: తుఫాన్‌ వర్షాలతో ఎలమంచిలి సబ్‌ డివిజన్‌లో ఎన్ని ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదో సోమవారం అంచనా వేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రాఽథమిక అంచాన ప్రకారం నాలుగు మండలాల్లో 1,053 ఎకరాల్లో వరి పనలు తడవగా, 725 ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. మండలాల వారీగా చూస్తే... ఎలమంచిలిలో 515 ఎకరాల్లో వరి పనలు తడిసిపోగా, 325 ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. రాంబిల్లిలో 27 ఎకరాల్లో వరి పనలు తడిసిపోగా, 170 ఎకరాల్లో పైరు నేలవాలింది. అచ్యుతాపురంలో 26 ఎకరాల్లో వరి పనలు తడిసిపోగా, 20 ఎకరాల్లో పైరు నేలమట్టమైంది. ఎస్‌.రాయవరంలో 485 ఎకరాల్లో వరి పనలు తడిసిపోగా, 210 ఎకరాల్లో కోతకు వచ్చిన పైరు నేలవాలింది. కాగా ఎలమంచిలి మండలంలోని సోమలింగపాలెం, జంపపాలెం, కట్టుపాలెం, తురంగలపాలెం, కొత్తపాలెం, తదితర గ్రామాల్లో నీట మునిగిన వరి పనలను వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి ఏడీఈ సుమంత, ఏఓ ఉమాదేవి, శాస్త్రవేత్తలు తులసీలక్ష్మి, ప్రసాద్‌, తదితరులు పరిశీలించారు. వరి పనలపై 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని, దీనివల్ల ధాన్యం రంగు మారకుండా ఉండడమే కాకుండా మొలకెత్తదని చెప్పారు. కోత కోయని పొలాల్లో నేలవాలిన వరి పైరు ఐదారు దుబ్బులు చొప్పున పైకి లేపి, గూడు మాదిరిగా కట్టాలని రైతులకు సూచించారు.

400 ఎకరాల్లో తడిసిన వరి పనలు

నక్కపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో వరి పనలు సోమవారం కూడా నీటిలోనే వున్నాయి. సీహెచ్‌బీ అగ్రహారం, కాగిత, గొడిచెర్ల, ఉద్దండపురం తదితర గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను మండల వ్యవసాయాధికారి కె.ఉమాప్రసాద్‌ నేతృత్వంలో సిబ్బంది పరిశీలించారు. సమారు 400 ఎకరాల్లో వరి పనలు తడిసిపోయాయని ఏవో చెప్పారు.

700 ఎకరాల్లో నష్టం

కోటవురట్ల: మండలంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వరి పనలు మరింతగా నీటిలో మునిగిపోయాయి. దీంతో వరి పనలను ఆరబెట్టుకునే పరిస్థితి లేకపోయిందని రైతులు వాపోతున్నారు. మండలంలో పాములవాక, జల్లూరు, కె.వెంకటాపురం, కైలాసపట్నం, అన్నవరం గ్రామాల్లో వరి రైతులు ఎక్కువ నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం మండలంలో 18 గ్రామాల పరిధిలో సుమారు 700 ఎకరాల్లో వరి పనలు తడిసిపోయి/ నీటి మునిగి రైతులకు నష్టం వాటిల్లింది.

545 ఎకరాల్లో నష్టం

ఎస్‌.రాయవరం: మండలంలోని తిమ్మాపురం, పెట్టుగోళ్లపల్లి, చినగుమ్ములూరు, పెద్ద గుమ్ములూరు గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పంటను సోమవారం జిల్లా వనరుల కేంద్రం డీడీఏ (ఎఫ్‌ఏసీ) టి.దాస్‌, విశాఖపట్నం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, ఏవో సౌజన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ, మండలంలో 545 ఎకరాల్లో వరి పనలు నీట మునిగాయని, 210 ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలిట్టు గుర్తించామని తెలిపారు.

600 ఎకరాల్లో నీట మునిగిన వరి పనలు

బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది, విజయరామరాజుపేట, లోపూడి, బంగారుమెట్ట, దిబ్బిడి, పోలేపల్లి, కందిపూడి, ఆర్‌.శివరామపురం, ఆర్‌.భీమవరం, నీలకంఠాపురం, చింతపాక, కరక, తదితర గ్రామాల్లో 600 ఎకరాల్లో వరి పనలు నీట మునిగాయి. సుమారు మూడు రోజుల నుంచి పనలు తడిసి వుండడంతో గింజ రంగుమారి, మొలకెత్తుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

170 ఎకరాల్లో నేలవాలిన వరి

రాంబిల్లి: మండలంలోని దిమిలి, కట్టుబోలు గ్రామాల్లో దెబ్బతిన్న వరిపంటను ఏవో సి.సుమంత సిబ్బందితో కలిసి పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయని, వర్షాలకు ముందు కుప్ప వేయని 27 ఎకరాల్లో వరి పనులు నీట మునిగాయని చెప్పారు. 170 ఎకరాల్లో వరి పైరు నేలవాలిందని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-13T01:07:13+05:30 IST

Read more