ఒరిగిన విగ్రహం

ABN , First Publish Date - 2022-09-11T06:13:57+05:30 IST

గాజువాకలో లంక గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలను అర్ధంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒరిగిన విగ్రహం
గాజువాకలో వినాయక విగ్రహం

గాజువాకలో ఏర్పాటుచేసిన భారీ వినాయకుడి విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు పోలీసుల సూచన

ఆర్‌ అండ్‌ బీ అధికారులతో తనిఖీ

విగ్రహం పొట్ట పైభాగంలో కర్రల భారం పడుతున్నదని నిర్ధారణ

నేడు అక్కడే నిమజ్జనం


విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

గాజువాకలో లంక గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలను అర్ధంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయించామని ఉత్సవ కమిటీ ప్రకటించుకొని భారీ వ్యాపారానికి తెరతీసింది. అయితే కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ విగ్రహం కొంత మేరకు ఒరిగిందని పలువురు ఫిర్యాదు చేయడంతో గాజువాక పోలీసులు దీనిపై దృష్టిసారించారు. వినాయక విగ్రహం పరిస్థితి ఏమిటి?, ఉత్సవం ముగిసేంత వరకు అది ఉంటుందా?, లేదా?...పరీక్షించి చెప్పాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను కోరారు. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బి ఈఈ సీహెచ్‌.రమేశ్‌, డీఈ ఫణీశ్వర్‌లు ఐదు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఆ మండపానికి వెళ్లి విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విగ్రహాన్ని నిల్చోబెట్టడానికి వెనుక సపోర్టింగ్‌ కోసం ఎక్కువ సంఖ్యలో సరుగుడు కర్రలు వినియోగించారు. వాటి భారం విగ్రహం పొట్ట పైభాగంలో పడుతోందని, వర్షాలు భారీగా కురిస్తే విగ్రహానికి నష్టం జరుగుతుందని తేల్చారు. అదేగానీ జరిగితే దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రమాదానికి గురవుతారని, వీలైనంత త్వరగా నిమజ్జనం చేయించాలని పోలీసులకు సూచించారు. అప్పటివరకూ విగ్రహానికి 80 అడుగుల దూరం నుంచే భక్తుల దర్శనం కల్పించాలని, దగ్గరకు రానీయకూడదని హెచ్చరించారు. ఈ మేరకు వెంటనే నిమజ్జనం చేయాలని ఉత్సవ నిర్వాహకులను పోలీసులు కోరారు. దానికి ఉత్సవ కమిటీ తొలుత నిరాకరించింది. నెల రోజులకని ఏర్పాట్లు చేశామని, ముందుగా చేస్తే నష్టం వస్తుందని, కుదరదని స్పష్టంచేసింది. అంతగా కావాలంటే ఈ నెల 18న నిమజ్జనం చేస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుత వాతావరణం ప్రకారం ఇంకా వర్షాలు కురిసే అవకాశం వున్నందున తక్షణమే నిమజ్జనం చేయాలని, లేదంటే తామే చేయిస్తామని పోలీసు అధికారులు హెచ్చరించడంతో ఉత్సవ కమిటీ దిగి వచ్చింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదే స్థలంలో నిమజ్జనం చేయడానికి అంగీకరించింది.


నిబంధనలకు తూట్లు

దేశమంతా గొప్పగా చెప్పుకొనే హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు కూడా తొమ్మిది రోజులు (నవరాత్రులు)తో  ముగుస్తాయి. కానీ ఇక్కడ ఉత్సవం పేరుతో ఎకరా విస్తీర్ణంలో ఎంటర్‌టెయిన్‌మెంట్‌, ఎగ్జిబిషన్లు పెట్టి పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఈ ఉత్సవ కమిటీకి పోలీసులు, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అనుకోని ప్రమాదం ఏదైనా సంభవిస్తే తప్పించుకోవడానికి, అదుపు చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. అయితే వాటిని కమిటీ పాటించలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమన్నా అమర్చలేదు. ఇంకా ఎటువంటి అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు. దీనికోసం కమిటీ రూ.4 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. వివిధ వస్తువులు విక్రయించడానికి 32 స్టాళ్లు ఏర్పాటుచేశారు. వారి దగ్గర రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు తీసుకున్నట్టు సమాచారం. ఇవికాకుండా చిన్నచిన్న షాపులు మరో పది వరకు ఉన్నాయి. వాటి నుంచి అద్దెల రూపంలో వసూలు చేశారు. భక్తులకు ఉచిత దర్శనం అని చెబుతూనే పూజారి దక్షిణ అంటూ రూ.20 చొప్పున టిక్కెట్‌ తీసుకుంటున్నారు. వినాయక ఉత్సవాలను వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని తెలిసినా సరే అధికార పార్టీ నేతలు అండగా నిలవడంతో అధికారులు మౌనంగా ఉండాల్సి వచ్చింది.


ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు

సీహెచ్‌.రమేశ్‌, ఈఈ, ఆర్‌ అండ్‌ బి

గాజువాకలో అతి పెద్ద వినాయకుడిని పెడుతున్నప్పుడు ముందుగా మాకు చెప్పలేదు. అనుమతి కోరలేదు. సలహాలు తీసుకోలేదు. ఆకస్మికంగా ఇప్పుడు ప్రమాదం ముంచుకు వస్తుందని గ్రహించి పరీక్షించి నివేదిక ఇవ్వాలని అధికారులు కోరారు. మూడు దఫాలుగా వెళ్లి పరీక్షించి, త్వరగా నిమజ్జనం చేయాలని సూచించారు. ఇకనైనా ఇలాంటి భారీ ఉత్సవాలకు ముందుగానే మమ్మల్ని సంప్రతిస్తే అవసరమైన సూచనలు ఇస్తాం.

Updated Date - 2022-09-11T06:13:57+05:30 IST