రేపటి నుంచి సాహిత్య సంబరాలు

ABN , First Publish Date - 2022-09-08T06:53:13+05:30 IST

విశాఖ ప్రియమైన రచయితల సాహిత్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 9 (శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు సింహాచలంలో సాహిత్య సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు, రచయిత ఇందూ రమణ తెలిపారు.

రేపటి నుంచి సాహిత్య సంబరాలు

సింహాలచం ప్రియాగార్డెన్స్‌లోని స్వామి కల్యాణ మండపం వేదిక

సింహాచలం, సెప్టెంబరు 7: విశాఖ ప్రియమైన రచయితల సాహిత్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 9 (శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు సింహాచలంలో సాహిత్య సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు, రచయిత ఇందూ రమణ తెలిపారు.  మహా పుణ్యక్షేత్రం సింహాచలంలోని ప్రియాగార్డెన్స్‌ ఆవరణలోని స్వామి కల్యాణ మండపం వేదికగా మూడు రోజుల సాహిత్య సమ్మేళనం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిని దాదాపు 200 మంది లబ్ధప్రతిష్ఠులైన రచయితలతోపాటు కొత్త, ఔత్సాహిక రచయితలు కూడా హాజరుకున్నారని వెల్లడించారు.


తొలిరోజు ఉదయం 9 గంటలకు కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, ప్రతిరోజూ ఉదయం నుంచి ఇష్టాగోష్టి, సాహితీచర్చలతోపాటు ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు కవి సమ్మేళనం, కథా కార్యశాల వేర్వేరుగా జరుగుతాయని తెలిపారు. కవి సమ్మేళనంలో పలువురు తమ కవితాగానం చేస్తారని, కథ కార్యశాలలో నాటి నుంచి నేటి కథ వరకు చర్చ పలు రూపాల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. 


 తొలిరోజు ‘కథా సాహిత్యం’ తీరుతెన్నులు, ‘తెలుగు భాష - సాహిత్య సొబగులు’ అనే అంశాలపై ప్రసంగాలుంటాయని తెలిపారు. రెండో రోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ ఉదయం 10 గంటలకు సింహాచలం పురవీధుల్లో సాహితీకారులందరితో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడోరోజు ప్రాచీన సాహిత్యం - ఆధునిక సాహిత్యం - తీరుతెన్నులు’ అనే అంశంపై పుస్తకావిష్కరణ, కథాసాహిత్యం తీరుతెన్నులపై చర్చ, మంచి కథల సంకలనం ఆవిష్కరణ ఉంటుందని ఇందూరమణ తెలిపారు.


Read more