‘పునఃసమీక్ష’పై తేలుస్తాం

ABN , First Publish Date - 2022-11-12T03:15:20+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం తదనంతరం...

‘పునఃసమీక్ష’పై తేలుస్తాం

గత ప్రభుత్వాల నిర్ణయాలను తర్వాతి సర్కార్లు సమీక్షించొచ్చా?

దీనిపైనే విచారణ జరుపుతాం

అనంతర కాలంలో ఈ వ్యవహారం విస్తృత ప్రభావం చూపుతుంది

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

టీడీపీ హయాంలో నిర్ణయాలపై సిట్‌ దర్యాప్తుపై గతంలో హైకోర్టు స్టే

ఎత్తివేయాలంటూ ఏపీ పిటిషన్‌

తదుపరి విచారణ 16కు వాయిదా

న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం తదనంతరం వచ్చే ప్రభుత్వాలకు ఉంటుందా లేదా అన్నదానిపై తేల్చుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేయడానికి జగన్‌ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)పై, కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్యలపై స్టే విధిస్తూ 2020లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ వ్యవహారంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం భావించిందని, తానే దర్యాప్తు జరపాలని అనుకోలేదని రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు విస్మరించిందని.. దుర్బుద్ధితోనే దర్యాప్తు జరిపిస్తున్నారని అనడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, ఇతర పరిపాలన అంశాలను పునఃసమీక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను 2019 డిసెంబరులో మంత్రివర్గం పరిశీలించిందని.. నివేదిక ఆధారంగా ఆ నిర్ణయాలపై సీబీఐ లేదా సీఐడీతో దర్యాప్తు జరిపించాలని నిశ్చయించిందని తెలిపారు. ఇందులో దుర్బుద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు.

ఈ కేసులో సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయాలని తాము దాఖలు చేసిన అప్లికేషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయని.. హైకోర్టు మాత్రం గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారాలు తదనంతర ప్రభుత్వానికి ఉండవని పేర్కొందని తెలిపారు. దర్యాప్తు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగరాదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తదనంతర ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు చేయించడానికి రాజకీయ శత్రుత్వం అనేది అడ్డురాదని 1969లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అసాధారణంగా ఉందన్నారు. ‘దర్యాప్తు జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

దర్యాప్తు జరిపిన తర్వాత దాని ఆధారంగా నేరుగా జైలుకు పంపిస్తారా? అలా ఉండదు. కొన్ని చర్యలు ఉంటాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతుంది. అవి కూడా చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయినా దర్యాప్తుపై స్టే ఇంకా కొనసాగుతోంది’ అని అభ్యంతరం వ్యక్తంచేశారు. హైకోర్టు స్టే ఉత్తర్వులపై స్టే విధించి దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలని కోరారు. లేదంటే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. 16వ తేదీన తొలి కేసుగా దీనిని విచారిస్తామని తెలిపింది. ఎందుకంటే అలాంటి దర్యాప్తుల అధికారాలకు సంబంధించి తదనంతర ప్రభుత్వాలపై ఇది విస్తృతమైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.

ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తూనే ఉంది..

పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మేం న్యాయపరమైన ప్రశ్నపైనే విచారిస్తున్నాం. మేమేమీ సీబీఐ కాదూ.. సిట్‌ కూడా కాదు’ అని వ్యాఖ్యానించింది. తమ చేతులు కట్టేశారని రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వాదన సరికాదని.. హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం అనేక ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిందని దవే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని రికార్డులోకి తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను ఎవరూ హరించలేదని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తూనే ఉందని.. ఒక ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ప్రస్తావించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘మేం ఆ అంశాలపై విచారణ జరపడం లేదు.

కేవలం తదనంతర ప్రభుత్వానికి గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం ఉందా లేదా అన్నదానిపైనే విచారణ జరుపుతున్నాం’ అని స్పష్టం చేసింది. ‘ఇది దొరతనపు కక్ష.. నేరపూరిత చర్య. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వేస్తే అభ్యంతరం లేదు. కానీ దర్యాప్తు జరిపి ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకే రాష్ట్రప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వకుండా దానిని ఎవరు అడ్డుకున్నారు? నేరుగా సీబీఐకి అప్పగించాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

ఈ ప్రక్రియను కోర్టుల ద్వారా చేయించాలని అనుకోవడమేంటి’ అని దవే ఈ సందర్భంగా ప్రశ్నించారు. తదుపరి విచారణను కోర్టు 16వ తేదీకి వాయిదావేసింది. కాగా.. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రధాన న్యాయమూర్తి కావడానికి ముందు ఆయనకు వ్యతిరేకంగా అప్పటి చీఫ్‌ జస్టి్‌సకు లేఖ రాసిన సీఎం జగన్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ న్యాయవాది సునీల్‌కుమార్‌సింగ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ కూడా పై పిటిషన్‌తో జతయి విచారణకు వచ్చింది. దీనిపైనా 16న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

టీడీపీ ప్రభుత్వ హయంలో తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను నిలిపివేయండి. దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించండి. లేదంటే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా మాకు అభ్యంతరం లేదు.

- రాష్ట్రప్రభుత్వం

హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం అనేక ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. ఒక ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

- వర్ల రామయ్య తరఫు న్యాయవాది

Updated Date - 2022-11-12T03:15:20+05:30 IST

Read more