-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Laxity in maintenance of Raiwada canal-NGTS-AndhraPradesh
-
రైవాడ కాలువ నిర్వహణలో అలసత్వం
ABN , First Publish Date - 2022-09-08T06:34:07+05:30 IST
రైవాడ కాలువ నిర్వహణలో అలసత్వం

పెట్రోలింగ్ సిబ్బంది ఇష్టారాజ్యం
కాలువలో కొట్టుకొస్తున్న మృతదేహాలు, పశువుల కళేబరాలు
ప్లాంట్‌కు చేరేంత వరకూ గుర్తించని సిబ్బంది
(విశాఖపట్నం-ఆంరఽదజ్యోతి)
నగరానికి తాగునీరు అందించే రైవాడ కాలువ నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కాలువ ద్వారా వచ్చే నీరు కలుషితం కాకుండా చూసేందుకు నియమించిన పెట్రోలింగ్ సిబ్బంది సరిగా పహారా కాయకపోవడం వల్ల తరచూ జంతు కళేబరాలు వస్తున్నాయి. ఇటీవల ఒక మృతదేహం నరవలోని ప్లాంట్ వరకూ చేరుకుంది. దీంతో నగరవాసులకు సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగర వాసులకు ప్రతిరోజూ 65 ఎంజీడీల వరకూ నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తోంది. అందులో 16 ఎంజీడీలు దేవరాపల్లి మండలంలోని రైవాడ రిజర్వాయర్ నుంచి తీసుకుంటోంది. రైవాడ రిజర్వాయర్ నుంచి 56 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా నీరు నరవలోని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు చేరుతుంది. పశువులు దిగి కలుషితం చేయకుండా, నీటి చోరీలు జరగకుండా, వర్షాకాలంలో గండ్లు వంటివి పడకుండా చూసేందుకు సుమారు 150 మందిని నీటి సరఫరా విభాగం అధికారులు నియమించుకున్నారు. వీరంతా కాలువపై నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ ప్రవాహాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. వీరందరికీ ఆప్కోస్ ద్వారా జీవీఎంసీయే జీతాలు చెల్లిస్తోంది. అయితే కాలువపై పెట్రోలింగ్ సరిగా చేయకపోవడంతో ఎక్కడికక్కడ పశువులు దిగినా, కొన్నిచోట్ల పశువులను కాలువలోనే కడగడం చేస్తున్నా పట్టించుకోవడం లేదనే వాదనం ఉంది. నీటిలో తరచూ జంతు కళేబరాలు కొట్టుకువస్తుండడం ఇందుకు చేకూర్చుతోంది. రెండు రోజుల కిందట ఏకంగా ఒక మృతదేహం నరవలోని ప్లాంట్‌కు నీటితోపాటు చేరడం తీవ్రకలకలం సృష్టించింది. కాలువపై ప్రతి కిలోమీటరుకు ఒకరు చొప్పున గస్తీ కాస్తున్నట్టు అధికారులు చెబుతుంటే...జంతు కళేబరాలు, మృతదేహాలు ఎలా ప్లాంట్‌కు చేరుతున్నాయంటే అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఎవరైనా కాలువలో ఆత్మహత్య చేసుకున్నా, ఏదైనా జంతువు కాలువలో దిగి మృతిచెందినా సరే అక్కడి సిబ్బంది దాన్ని వెంటనే గుర్తించాలి. కాలువలో నీటి ప్రవాహాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి జంతు కళేబరం లేదా మృతదేహాన్ని బయటకు తీసేయాలి. అనంతరం ఆ ప్రాంతంలో నీటిని బయటకు తోడేసిన తర్వాత తిరిగి కాలువలో ప్రవాహాన్ని యథావిఽధిగా కొనసాగించాలి. కానీ అలా జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే నీటిని జీవీఎంసీ అధికారులు శుద్ధి చేసి సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆందోళన తొలగడం లేదు. కాలువపై సిబ్బంది పహారా పక్కాగా వుండేలా పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఎందుచేతనో ఆ పని చేయడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ నిర్వహణపై గట్టిగా దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.