జిల్లాలో 2,969 గ్రామాల్లో భూ రీసర్వే

ABN , First Publish Date - 2022-10-11T06:17:41+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 2,969 రెవెన్యూ గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియ చేపడతామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

జిల్లాలో 2,969 గ్రామాల్లో భూ రీసర్వే
కలెక్టరేట్‌లో భూ సర్వే సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ఐదు సర్వే సంస్థలకు పనుల అప్పగింత 

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

పాడేరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 2,969 రెవెన్యూ గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియ చేపడతామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. భూముల సర్వే నిర్వహించే సంస్థల ప్రతినిఽధులతో సోమవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. భూ సర్వే నిర్వహణకు వినియోగించే పరికరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచే జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2,661 గ్రామాల్లో, రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 308 గ్రామాల్లో ప్రణాళికాబద్దంగా భూ రీసర్వే చేపడతారన్నారు. అలాగే సర్వే సంస్థలకు మండల సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సహకరించాలని  ఆదేశించారు. 

ఐదు సంస్థలతో భూ రీసర్వే ప్రక్రియ

జిల్లాలోని భూ రీసర్వే ప్రక్రియను ఐదు సర్వే సంస్థలతో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో జియోకాన్‌ సర్వే సంస్థ, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో సిల్వర్‌ లైన్‌ టెక్నో సర్వీసెస్‌ సంస్థ, చింతపల్లి, జి.మాడుగుల, జీకేవీఽధి మండలాల్లో ఎంఆర్‌కే జియో మాట్రిక్స్‌ సంస్థ, అనంతగిరి, అరకులోయ, కొయ్యూరు మండలాల్లో ప్లానెట్‌ జియోటెక్‌ సంస్థ భూముల రీసర్వే చేస్తాయన్నారు. అలాగే రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, రంపచోడవరం మండలాల్లో నవీన్‌ సర్వే అండ్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థ భూ రీసర్వే ప్రక్రియను చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సర్వే విభాగం ఏడీ వై.మోహనరావు, సర్వే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Read more