Chief Minister YS Jaganmohan Reddy: భూముల వేలం.. మట్టికి బేరం

ABN , First Publish Date - 2022-11-25T03:03:39+05:30 IST

‘‘భూములు వేలం వేద్దాం. మట్టిని అమ్మేద్దాం. నదీజలాల్లోని మత్స్య సంపదను కూడా ఆదాయ వనరుగా మార్చుకుందాం.

Chief Minister YS Jaganmohan Reddy: భూముల వేలం.. మట్టికి బేరం

సీఎం ఆదేశాలతో జిల్లాల్లో జల్లెడ మొదలు

మత్స్యసంపదనూ అసలు వదలొద్దు

ఆ నిధులతో ప్రాజెక్టులు పూర్తిచేయండి

నిధులడిగిన అధికారులకు సీఎం సలహా

7783 ఎకరాలను గుర్తించిన అధికారులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘భూములు వేలం వేద్దాం. మట్టిని అమ్మేద్దాం. నదీజలాల్లోని మత్స్య సంపదను కూడా ఆదాయ వనరుగా మార్చుకుందాం. ఇలా స్వీయ ఆదాయ మార్గాలతోనే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకుందాం’’... కొద్దికాలం కిందట జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వినూత్న ఆదేశాలివి! ఆ వెంటనే సాగునీటి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తమ పరిధిలో ‘వేలం’ వేయదగ్గ భూముల చిట్టా సిద్ధం చేశారు. 7783 ఎకరాలు ఎంచక్కా అమ్ముకోవచ్చునని తేల్చారు. సీఎం ఆదేశాలు అమలైతే... ఆ భూములను వేలం వేసేస్తారు. ఆ తర్వాత వచ్చే డబ్బులనైనా ప్రాజెక్టుల విక్రయానికి కేటాయిస్తారా? లేక... బటన్‌ నొక్కుడు కింద పంచేస్తారా? అనేదే అధికారుల ఆందోళన! సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలంటూ చాలాకాలంగా సీఎంను అధికారులు కోరుతున్నారు. ప్రాజెక్టులవారీగా ఏటా రూ.13,000 కోట్లను విడుదల చేయాలని లెక్కలు అందించారు. ఈ నిధుల విడుదల అంశాన్ని పక్కన పడేసిన ముఖ్యమంత్రి... ఆదాయ మార్గాలను గురించి జల వనరుల శాఖ అధికారులకు కర్తవ్యబోధ చేశారు.

ఈ ఏడాది మే నెలలో ఇదంతా జరిగింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు రాష్ట్రంలోని జలవనరుల శాఖ కార్యాలయాలు, భూముల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ దుర్భిక్ష నివారణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సహా ఉత్తరకోస్తాలోని ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రూ.13,000 కోట్లకుపైగా నిధులు కేటాయించడమేగానీ అవి మంజూరుకు నోచుకోవడంలేదు. దీంతో..ప్రాజెక్టులు ఎక్కడివక్కడ నిలిచిపోయి మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఆగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలు, మరోవైపు జాప్యం కారణంగా పెరిగిపోతున్న అంచనా వ్యయాలు జలవనరుల శాఖను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఎప్పుడు శాఖ సమీక్షకు పిలిచినా నిధులు ఇవ్వాలంటూ అధికారులు అభ్యర్థిస్తూనే ఉన్నారు. ఇటీవల ఇలాంటిదే ఒక సమీక్షా సమావేశం జరిగింది. అధికారులు ప్రాజెక్టుల వారీ ప్రగతితో సహా..అవసరమయ్యే నిధుల గురించి ముఖ్యమంత్రికి ఈ సమావేశంలో సమాచారం అందించారు. నిధుల విషయంలో జగన్‌ ఉదారంగా వ్యవహరిస్తారని అధికారులు ఆశించారు. అయితే..అందుకు విరుద్ధమైన ఆదేశాలు సీఎం నుంచి అందడం వారిని విస్మయపరిచింది. ఆ శాఖ ఆధీనంలోని విలువైన భూములు వేలం వేయాలనీ, నిరంతర ఆదాయ వనరుగా ఉన్న మట్టిని బేరం పెట్టాలంటూ సీఎం సలహాలు ఇవ్వడం వారిని నివ్వెరపరిచింది.

జల శాఖలో జల్లెడ

విజయవాడ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ భూములు ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. విలువైన మరికొన్ని భూములను పోలీసుశాఖ సొంతం చేసుకుంది. జిల్లాల్లో ఉన్న భూములు కూడా ఇలాగే పరాధీనమయ్యాయి. అసలు తన ఆస్తుల పరిస్థితి ఏమిటనేది జల వనరుల శాఖకే తెలియని పరిస్థితి! దీంతో భూముల వివరాలను తీసే పనిలో జల వనరుల శాఖ పడింది. మొత్తంగా 7783.22 ఎకరాలు ఉన్నాయని గుర్తించారు. వీటిన్నింటిని వేలం వేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించాలనే సీఎం ఆదేశాలు అమలు కావడమే తరువాయి! జల వనరుల శాఖకు చెందిన నదుల్లోనూ.. ప్రాజెక్టుల్లోనూ మత్స్య ఉత్పత్తుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయాన్ని సంపాదించవచ్చని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

రిజర్వాయర్లలో 25 శాతం జల వనరుల శాఖ ఆదాయాన్ని పొందే వీలుందని జగన్‌ ఆ భేటీలో వెల్లడించారు. పరిశ్రమలకు సరఫరా చేసే జలాల నుంచి కూడా గణనీయంగా ఆదాయాన్ని పొందవచ్చని సీఎం వెల్లడించారు. భూముల వేలం ద్వారా ఆదాయం పొందడంతో పాటు..కమర్షియల్‌ ప్రాంతాల్లో లీజులకు ఇచ్చి ఏటా ఆదాయాన్ని పెంచుకోవచ్చని సీఎం సూచించారట! సరే అన్నీ అయ్యాక, మరి నిధుల మంజూరు మాటేమిటని అధికారులు అడగడం ఆలస్యం సీఎం మౌనం దాల్చినట్టు సమాచారం.

Updated Date - 2022-11-25T09:33:50+05:30 IST

Read more