లంపి స్కిన్‌ వ్యాధితో అప్రమత్తం

ABN , First Publish Date - 2022-09-30T05:58:01+05:30 IST

పశువులకు కొత్తగా సోకుతున్న లంపి స్కిన్‌ (ముద్ద చర్మవ్యాధి) పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ బి.ప్రసాదరావు సూచించారు.

లంపి స్కిన్‌ వ్యాధితో అప్రమత్తం
సబ్బవరంలోని పశు వ్యాధి నిర్ధారణ కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ బి.ప్రసాదరావు

జిల్లాకు 25 వేల గోటాపాక్స్‌ వ్యాక్సిన్‌ సరఫరా

పశు సంవర్థక శాఖ అధికారి బి.ప్రసాదరావు


సబ్బవరం, సెప్టెంబరు 29: పశువులకు కొత్తగా సోకుతున్న లంపి స్కిన్‌ (ముద్ద చర్మవ్యాధి) పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ బి.ప్రసాదరావు సూచించారు. గురువారం స్థానిక పశు వ్యాధుల నిర్ధారణ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లాలో దేవరాపల్లి మండలం చింతలపూడిలో ఐదు, బుచ్చెయ్యపేట మండలం వడ్దాదిలో ఆరు, అనకాపల్లి మండలం సీహెచ్‌ఎన్‌ అగ్రహారంలో రెండు పశువులకు లంపి స్కిన్‌ వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. ఈ వ్యాధి నివారణ కోసం జిల్లాకు 25 వేల గోటాపాక్స్‌ వ్యాక్సిన్‌ సరఫరా అయ్యాయన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పశువుల సంతల నిర్వహణను, పశువుల రవాణాను నిలిపివేసినట్టు చెప్పారు.  వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలతోపాటు తీవ్ర జ్వరం వస్తుందని, వెంటనే గుర్తించి చికిత్స అందించకపోతే నాలుగైదు రోజుల్లో పశువు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. లంపి స్కిన్‌ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పశువైద్య కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఏడీ కె.ఉషాకుమారి, వెటర్నీరీ వైద్యులు ఎస్‌స్వర్ణలత, ఎస్‌.సౌజన్య, కె.నాగలక్ష్మి, తదితరులు వున్నారు.


Read more