అల్లూరి జిల్లాకు నిధుల కొరత!

ABN , First Publish Date - 2022-03-18T06:30:29+05:30 IST

పాడేరు కేంద్రంగా ఏర్పాటుకానున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాల మరమ్మతులకు నిధుల కొరత సమస్యగా మారింది.

అల్లూరి జిల్లాకు నిధుల కొరత!
కలెక్టరేట్‌ కానున్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.14 కోట్లతో ప్రతిపాదనలు 

ప్రభుత్వం ఇచ్చింది రూ.3 కోట్లు 

అరకొర నిధుల మంజూరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు


పాడేరు, మార్చి 17:

పాడేరు కేంద్రంగా ఏర్పాటుకానున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాల మరమ్మతులకు నిధుల కొరత సమస్యగా మారింది. సుమారు 40 ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల మరమ్మతులు, ఫర్నిచర్‌, విద్యుత్‌ సదుపాయం, తదితర పనులకు రూ.14 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా...ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు (సివిల్‌  పనులకు రూ.2 కోట్లు, పర్నిచర్‌కు రూ.కోటి) మాత్రమే మంజూరుచేసింది. అరకొరగా మంజూరైన ఈ నిధులతో ఏమి చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

పాడేరులో జిల్లా కార్యాలయాల కోసం గుర్తించిన ప్రభుత్వ భవనాలను సిద్ధం చేసేందుకు రూ.7.9 కోట్లు, విద్యుత్‌ పనులకు రూ.1.9 కోట్లు, ఫర్నిచర్‌కు రూ.4.5 కోట్లు...మొత్తం రూ.14.3 కోట్లు అవసరమవుతాయని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో కలెక్టరేట్‌ కార్యాలయం కోసం రూ.3.1 కోట్లు, అందులోనే జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటుకు మరో రూ.75 లక్షలు అవసరమని అధికారులు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అన్నింటికీ కలిపి కేవలం రూ.3 కోట్లు మాత్రమే మంజూరుచేసింది. కలెక్టరేట్‌, జేసీ కార్యాలయాల ఏర్పాటుకు కలిపి రూ.76 లక్షలు కేటాయించింది. అన్ని జిల్లా కార్యాలయాలకు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్‌ కోసం రూ.74 లక్షలు మంజూరుచేశారు. ఇక ఇతర జిల్లా కార్యాలయాల భవనాల మరమ్మతులు, విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకుగానూ రూ.కోటిన్నర ఇచ్చారు. ఆ రూ.3 కోట్లు కలెక్టరేట్‌కు సరిపోతాయని, ఇతర కార్యాలయాల్లో సదుపాయాలకు మరిన్ని నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంజూరైన రూ.3 కోట్లతో పనులు చేపట్టేదుకు సమాయత్తమవుతున్నారు. 

Read more