Lokesh Yatra: కుప్పం టూ సిక్కోలు జనవరి 27 నుంచి లోకేశ్‌ యాత్ర

ABN , First Publish Date - 2022-11-12T04:07:34+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించనున్నారు. ..

Lokesh Yatra: కుప్పం టూ సిక్కోలు జనవరి 27 నుంచి లోకేశ్‌ యాత్ర

ఏడాదికి పైగా జరగనున్న పాదయాత్ర

నిర్వహణపై టీడీపీ పక్కా ప్రణాళిక

యువతతోపాటు అన్నివర్గాల సమస్యలపై దృష్టి

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాయలసీమ నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. జనవరిలో సంక్రాంతి తర్వాత యాత్ర ప్రారంభించాలని ఆయన ఇంతకు ముందే నిర్ణయించుకొన్నారు. 24, 27 తేదీల్లో ఒక రోజును ఎంపిక చేసుకోవాలని పండితులు సూచించగా, రిపబ్లిక్‌ దినోత్సవం మర్నాడు 27 తేదీ శుక్రవారం నుంచి చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఒక కొసన ఉన్న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమై ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంతో ముగియనుంది. కనీసం ఏడాదిపాటు ఇది కొనసాగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2024 ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి కొద్దిగా ముందు ఫిబ్రవరి లేదా మార్చి నెల వరకూ పాదయాత్రను నడిపించాలన్న పట్టుదలతో లోకేశ్‌ ఉన్నారు. ఈ లెక్కన సుమారు 400 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది.

సుమారు నాలుగు నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరం లోకేశ్‌ నడిచే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ యాత్రలో లేవనెత్తడానికి లోకేశ్‌ బృందం కసరత్తు చేస్తోంది. యువతను ఆకర్షించే విధంగా ఈ యాత్ర ఉండాలన్న ప్రతిపాదనను ఆయన సన్నిహిత బృందం పార్టీ అధినాయకత్వం ముందు పెట్టింది. ‘యువత ప్రధానమైన చోదక శక్తి. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కువ నష్టపోయింది.. ఆశలు కోల్పోయింది ఆ వర్గమే. వారిని ఆకర్షించి వారిని తన వైపు తిప్పుకొనే దిశగా లోకేశ్‌ యాత్ర సాగితే ఫలితాలు బాగుంటాయని అనుకొంటున్నాం’ అని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు. కానీ ఇంత పెద్ద పాదయాత్రను ఒక వర్గం లక్ష్యంగా నిర్వహించకుండా మరింత విస్తరించాలన్నది మరి కొందరి పార్టీ నేతల అభిప్రాయం. ‘వైసీపీ పాలనలో నష్టపోయిన వర్గాలు చాలా ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు, కార్మికులు, అనేక సామాజిక వర్గాలు ఇందులో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం.. తనకు చాలా బలం ఉందని భావిస్తున్న పేద వర్గాల్లో కూడా అసంతృప్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. వీటన్నింటినీ ఈ యాత్రలో లేవనెత్తి ప్రజల్లో చర్చపెట్టి వారిని సానుకూలంగా మలుచుకునే దిశగా యాత్రను రూపుదిద్దాలని అనుకొంటున్నాం’ అని ఒక సీనియర్‌ నేత చెప్పారు. యాత్ర నిర్వహణ ఏర్పాట్లను టీడీపీ ఇప్పటికే మొదలు పెట్టింది. డిసెంబరు నెలాఖరునాటికి ఇవన్నీ పూర్తి కావాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ యాత్రకు ముందు తన నియోజకవర్గం మంగళగిరిలో విస్తృతంగా పర్యటించే పనిలో లోకేశ్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-12T05:52:08+05:30 IST