కోరి ఆర్గానిక్స్‌లో భారీ పేలుడు

ABN , First Publish Date - 2022-09-11T06:18:59+05:30 IST

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మాసిటీలో గల ‘కోరి ఆర్గానిక్స్‌’లో శనివారం భారీ పేలుడు సంభవించింది.

కోరి ఆర్గానిక్స్‌లో భారీ పేలుడు
బ్లాక్‌ కిటికీ గ్లాసులు పగిలిన దృశ్యం

రియాక్టర్‌లో అధిక ఒత్తిడి కారణంగా పగిలిన గ్లాస్‌ కండెన్సర్‌

అధిక మోతాదులో వెలువడిన రసాయన వాయువులు

భయంతో పరుగులు తీసిన కార్మికులు 

దెబ్బతిన్న ప్రొడక్షన్‌ బ్లాక్‌


పరవాడ, సెప్టెంబరు 10: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మాసిటీలో గల ‘కోరి ఆర్గానిక్స్‌’లో శనివారం భారీ పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, పరిశ్రమ యాజమాన్యం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంపెనీలోని ప్రొడక్షన్‌ బ్లాక్‌-2 మొదటి అంతస్థులో గల 205 నంబరు రియాక్టర్‌లో ఏబీఎన్‌ అనే ప్రొడక్టును ప్రాసెస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రియాక్టర్‌ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఒత్తిడికి గురైంది. దీంతో దానికి అనుసంధానంగా వున్న మూడు మీటర్ల ఎత్తు కలిగిన గ్లాస్‌ కండెన్సర్‌ ఒక్కసారిగా పగిలిపోయింది. బ్లాక్‌ మొత్తం కిటికీల అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. గ్లాస్‌ కండెన్సర్‌ పగిలిపోవడంతో అందులో నుంచి అధిక మోతాదులో రసాయన వాయువులు విడుదలయ్యాయి. ఆ సయయంలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు  బ్లాక్‌ అత్యవసర ద్వారం నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి బ్లాక్‌ పలుచోట్ల దెబ్బతింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కూడా గోడల నుంచి పెచ్చులూడిపడ్డాయి. ఎలక్ట్రికల్‌ వ్యవస్థ పాడైంది. రసాయన వాయువులు అదుపులోకి రావడానికి కొంత సమయం పట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సురేశ్‌, పరవాడ సీఐ ఈశ్వరరావు, ఆర్‌ఐ రామారావు హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కోరి ఆర్గానిక్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ పరిశ్రమలో ఇప్పటికి మూడుసార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. విచారణ జరిపించి, యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్నారు.


Read more