ఉక్కు డీజీఎంకు కత్తి పోట్లు!

ABN , First Publish Date - 2022-05-24T06:46:10+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ డీజీఎంపై ఓ చైన్‌ స్నాచర్‌ కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి టౌన్‌షిప్‌లో కలకలం రేపింది.

ఉక్కు డీజీఎంకు కత్తి పోట్లు!

మహిళ మెడలో ఆభరణాలు దోచుకున్న దుండగుడిని పట్టుకునే యత్నంలో దాడికి గురైన అధికారి

పోలీసుల అదుపులో నిందితుడు...అతని వద్ద తుపాకీ లభ్యం


ఉక్కుటౌన్‌షిప్‌, మే 23: స్టీల్‌ప్లాంట్‌ డీజీఎంపై ఓ చైన్‌ స్నాచర్‌ కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి టౌన్‌షిప్‌లో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సెక్టార్‌-5లో భారతి అనే మహిళ ఒంటరిగా నడిచి వెళుతుండగా, ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించిన దుండగుడు...బెదిరించి బంగారు ఆభరణాలు తీసుకుని మార్కెట్‌ మార్గంలో ముందుకు వెళ్లిపోయాడు. అనంతరం భారతి కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల్లో గలవారు అక్కడకు చేరుకున్నారు. అయితే ఆ మార్గంలో స్టాపర్‌ ఉండడంతో దుండగుడు వెనక్కి తిరిగి వస్తూ కనిపించాడు. ఆ సమయంలో దుండగుడిని స్టీల్‌ప్లాంట్‌ డీజీఎం మనోహార్‌రెడ్డి వెనుక నుంచి పట్టుకున్నారు. దీంతో దుండగుడు తన వద్ద వున్న కత్తితో మనోహార్‌రెడ్డి వీపుపై రెండుసార్లు బలంగా పొడిచి పరారయ్యాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఉక్కు జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఒరిజినల్‌ తుపాకీనా? లేక నకిలీదా? అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.


గ్రామ/వార్డు వలంటీర్‌లకు అమ్మఒడి జాబితాలు

మూడు రకాలు విడుదల...అర్హులు, అనర్హులు, పునఃపరిశీలన

ప్రతి తల్లి విధిగా సచివాలయానికి వెళ్లి వేలిముద్ర వేయాల్సిందే

విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి): అమ్మఒడికి సంబంధించి ప్రభుత్వం సోమవారం మూడు రకాల జాబితాలను విడుదల చేసింది. ఇవి గ్రామ/వార్డు వలంటీర్‌ లాగిన్‌కు వచ్చాయి. మూడు రకాల జాబితాలపై ప్రభుత్వం పలు సూచనలు చేసింది. తొలి జాబితాలో అర్హులైన పిల్లల వివరాలు ఉంటాయి. వీటిపై అభ్యంతరాలు వుంటే తెలియజేయడంతోపాటు అవసరమైన డాక్యుమెంట్ల కాపీలు రెండు జతలు తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకోవాలి. రెండో జాబితాలో అనర్హుల పేర్లు ఉంటాయి. దీనిపై అభ్యంతరాలు వుంటే పక్కా వివరాలు, డాక్యుమెంట్లు రెండు జతలు తీసుకోవాలి. మూడో జాబితాలో రీ వెరిఫికేషన్‌/రీ కన్ఫర్మేషన్‌ వివరాలు పొందుపరిచారు. ఈ జాబితాలో పేర్కొన్న వివరాల మేరకు పిల్లలు, తల్లుల ఆధార్‌ నంబర్లు, బ్యాంకు పుస్తకం, రేషన్‌ కార్డు, రెండు జతల కాపీలు, ఫోన్‌ నంబర్లు సమర్పించాలి. కాగా అమ్మఒడికి అర్హులైన విద్యార్థి/విద్యార్థిని తల్లి వేలిముద్ర తీసుకునే బాధ్యతను వలంటీర్‌కు అప్పగించారు. అయితే వేలిముద్ర డివైస్‌లు కొరత వుండడంతో సమీపంలో గల గ్రామ/వార్డు సచివాలయానికి తల్లులు వెళ్లి వేలిముద్రలు వేయాలని సూచిస్తున్నారు. మంగళ/బుధవారాల్లో వేలిముద్రలు వేసే కార్యక్రమం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం వర్తించిన లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబరు అనుసంధానం చేసుకోవాలి. బ్యాంకు ఖాతా ఎన్‌పీసీఐకి అనుసంధానమైందో లేదో సరిచూసుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ ఖాతాలున్నా ఒక ఖాతాకే ఎన్‌పీసీఐకి అనుసంధానం చేయాలి. ఈ ప్రక్రియ పూర్తిచేసిన తరువాత సంబంధిత వలంటీర్‌ దగ్గర ఈకేవైసీ చేయించాలి. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఈ వివరాలు అప్‌లోడ్‌ అయ్యాయో లేదో సరిచూసుకోవాలి.


ఆర్టీసీకి రోజుకు రూ.1.15 కోట్ల ఆదాయం

ద్వారకా బస్‌స్టేషన్‌, మే 23: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ రోజువారీ ఆదాయం పెరిగింది. రీజియన్‌లో ఏడు డిపోలకు చెందిన 800 బస్సులు రోజుకు 2.35 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతూ ప్రయాణికులకు సేవలందిస్తుండగా...ఈనెల 1 నుంచి 15 వరకు సగటున  రూ.1.05 కోట్ల ఆదాయం లభించింది. ఈ నెల 16 నుంచి 23 వరకు రోజుకు రూ.1.15 కోట్లు వచ్చింది. వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల టిక్కెట్‌ రేట్లు పెంపు కూడా ఆదాయం పెరుగుదలకు దోహదపడిందన్నారు. 

ఆక్యుపెన్సీ రేషియో పెరుగుదల: గడిచిన వారం రోజులుగా ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగింది. ఈ నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు 69 శాతంగా, 16 నుంచి 23వ తేదీ వరకు 72 శాతంగా నమోదయ్యింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం వల్లే ఆక్యుపెన్సీ రేషియో, ఆదాయం పెరిగాయని అధికారులు చెబుతున్నారు. 

Read more