శస్త్ర చికిత్సలకు గ్రహణం

ABN , First Publish Date - 2022-08-17T06:48:18+05:30 IST

కేజీహెచ్‌లో నిర్వహించే అత్యంత ఖరీదైన తుంటి, మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల భారం ఇప్పుడు రోగులపైనే పడుతోంది.

శస్త్ర చికిత్సలకు గ్రహణం

కేజీహెచ్‌లో తుంటి, మోకీళ్ల మార్పిడి

ఆపరేషన్‌లకు నిధులు నిలిపివేత

పరికరాల కొనుగోలుకు డబ్బులివ్వని వైసీపీ ప్రభుత్వం 

బయట కొనుగోలు చేసుకుని తెచ్చుకోమంటున్న వైద్యులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

కేజీహెచ్‌లో నిర్వహించే అత్యంత ఖరీదైన తుంటి, మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల భారం ఇప్పుడు రోగులపైనే పడుతోంది. ఈ శస్త్ర చికిత్సలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించేది. కొన్నేళ్లుగా నిలిపివేసింది. ప్రస్తుతం సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు ఆర్థో విభాగంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నప్పటికీ అందుకు అవసరమయ్యే పరికరాలను కొనుగోలు చేసుకోవాల్సి రావడంతో నిరుపేద రోగులు ఇబ్బంది పడుతున్నారు. 


స్టేట్‌ ఇల్‌నెస్‌ ఫండ్‌ నుంచి.. 

మోకాళ్లు అరిగి, నడవలేని స్థితికి చేరిన, తుంటికి రక్త ప్రసరణ జరగక ఇబ్బందులు పడుతున్న వారికి హిప్‌ అండ్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (మోకాళ్లు, తుంటి మార్పిడి) శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేయించాలంటే కనీసం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో నిరుపేద రోగులకు ఈ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్‌ ఇల్‌నెస్‌ అసిస్టెన్స్‌ ఫండ్స్‌ నుంచి నిధులను అందించేవారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కొంత సహకరించేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిధులు రాకపోవడంతో శస్త్ర చికిత్సల నిర్వహణ నిలిచిపోయింది. దీంతో ఆయా సమస్యలతో వచ్చే రోగులకు శస్త్రచికిత్స ఉచితంగా చేస్తామని, అందుకు అవసరమయ్యే పరికరాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రూ.వేలు వెచ్చించలేని ఎంతోమంది ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. కొందరు ప్రైవేటుతో పోలిస్తే కేజీహెచ్‌లో ఖర్చు తగ్గుతుండడంతో భారమైనా ముందుకు వెళుతున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 60 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడేళ్లుగా నిధులు అందక శస్త్రచికిత్సలు నిర్వహంచలేని పరిస్థితి నెలకొంది. ఈ శస్త్ర చికిత్సల నిర్వహణకు ప్రభుత్వం నిధులు అందించాలని, ఇందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని  బాధితులు కోరుతున్నారు. 

Read more