కేజీహెచ్‌లో రోగుల బారులు

ABN , First Publish Date - 2022-10-11T06:40:30+05:30 IST

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌కు సోమవారం రోగులు పోటెత్తారు.

కేజీహెచ్‌లో రోగుల బారులు

ఓపీ కౌంటర్‌ నుంచి క్యాజువాల్టీ గేటు వరకు క్యూలు

‘ఓపీ’ నిబంధనల్లో మార్పులే కారణం

ఇకపై ఏరోజుకారోజు కొత్త చీటీ తీసుకోవలసిందే...

క్యూలో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడిన వృద్ధులు, మహిళలు


మహారాణిపేట, అక్టోబరు 10:

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌కు సోమవారం రోగులు పోటెత్తారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి వందలాది మంది వచ్చారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఓపీ కౌంటర్‌ నుంచి క్యాజువాల్టీ గేటు వరకు రోగులు బారులుతీరి కనిపించారు. సీజనల్‌ వ్యాధుల విజృంభణతోపాటు ఆస్పత్రి అధికారులు తీసుకువచ్చిన కొత్త నిబంధన కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. సాధారణంగా కేజీహెచ్‌కు మొదటిసారి వచ్చిన రోగులు అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) చీటీ తీసుకుని వైద్య సేవలు పొందుతుంటారు. రెండోసారి మళ్లీ కొత్తగా ఓపీ చీటీ తీసుకోవాల్సిన అవసరం గతంలో ఉండేది కాదు. పాత ఓపీ నంబర్‌ తీసుకువెళితే సరిపోయేది. అయితే, తాజాగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి హాస్పిటల్‌ అధికారులకు ఒక సర్క్యులర్‌ జారీచేశారు. దీని ప్రకారం ఆస్పత్రికి వచ్చే రోగులు తప్పనిసరిగా కొత్త ఓపీ చీటీ తీసుకోవాలి. ఆ రోజు ఓపీ నంబర్‌ వుంటేనే రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాత రోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఓపీ కౌంటర్‌ వద్ద నిల్చుని నంబర్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగానే సోమవారం రోగుల తాకిడి కొంచెం అధికంగానే ఉంటుంది. దానికి తోడు కొత్తగా తెచ్చిన నిబంధనతో ఈ సోమవారం ఓపీ కౌంటర్‌ వద్ద భారీ క్యూలు కనిపించాయి. క్యూల్లో నిల్చోలేక చిన్నారులు, వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొందరు ఎక్కువ సమయం నిల్చోలేక మధ్యలోనే వెనుతిరిగారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ కౌంటర్‌ వద్ద రోగుల తాకిడి కనిపించింది. మందులు కౌంటర్‌, ఆయా విభాగాల ఛాంబర్లు వద్ద కూడా రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. 


ఆ విభాగాల వద్ద ఎక్కువ.. 

కేజీహెచ్‌కు సోమవారం వచ్చిన వారిలో ఎక్కువ మంది సీజనల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వర బాధితులతో జనరల్‌ మెడిసిన్‌ విభాగం ఓపీ చాంబర్‌ కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆ విభాగానికి చెందిన వైద్యులు, పీజీలు  సేవలు అందించారు. నీరసంగా ఉన్న వారిని, చిన్నారులు, వృద్ధులను ఇన్‌పేషెంట్‌లుగా చేరాలని సూచించారు. కొందరికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే, ఆర్థో, స్కిన్‌, గైనిక్‌ విభాగాల ఓపీలకు భారీగానే రోగులు తరలివచ్చారు. ఎక్స్‌రే, స్కానింగ్‌ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో రోగులు నిరీక్షిస్తూ కనిపించారు. 


కౌంటర్లు పెంచాలి.. 

ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ కొత్త ఓపీ చీటీ తీసుకోవాలన్న నిబంధన వల్ల ప్రస్తుతం వున్న ఓపీ కౌంటర్లకు తాకిడి పెరిగింది. కౌంటర్ల సంఖ్య పెంచినప్పటికీ స్థలం తక్కువగా వుండడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి, ఉన్నతాధికారులు ఓపీ కౌంటర్ల సంఖ్యను పెంచాలని పలువురు సూచిస్తున్నారు. అవసరమైతే సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ వద్ద ఓపీ కౌంటర్లు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. అలాగే పాత, కొత్త ఓపీలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటుచేయడం ద్వారా ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం చూపించవచ్చునంటున్నారు. ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వుంటున్నందున వారిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోగులు సహాయకులు, బంధువులు కోరుతున్నారు.

Updated Date - 2022-10-11T06:40:30+05:30 IST