కబళిస్తున్న కెరటాలు

ABN , First Publish Date - 2022-01-03T06:46:11+05:30 IST

కొన్నాళ్ల కిందట కొమ్మాదిలోని గాయత్రి ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పవన్‌కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన హరికిరణ్‌ రుషికొండ వద్ద సముద్రస్నానానికి దిగి మృతిచెందారు.

కబళిస్తున్న కెరటాలు

మత్యుకుహరంగా మారిన విశాఖ సాగర తీరం

గత పదేళ్లలో సముద్రంలో మునిగి 350 మంది మృతి

సందర్శకులకు కొరవడిన సదుపాయాలు, భద్రత 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం

అరకొరగా హెచ్చరిక బోర్డులు

ఆచరణకు నోచుకుని వాచ్‌టవర్‌

ప్రతిపాదనల్లోనే ‘బీచ్‌ పోలీసు’ విభాగం


                      (ఆంరఽధజ్యోతి/విశాఖపట్నం)

కొన్నాళ్ల కిందట కొమ్మాదిలోని గాయత్రి ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పవన్‌కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన హరికిరణ్‌ రుషికొండ వద్ద సముద్రస్నానానికి దిగి మృతిచెందారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు, ఒడిశాకు చెందిన యువతి  ఆర్‌కే బీచ్‌ వద్ద సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. 


విశాఖకు నగరానికి మణిహారంగా భావించే సముద్ర తీరం మృత్యుకుహరంగా మారుతోంది. యారాడ బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు సముద్రతీరం సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. యారాడ, కోస్టల్‌బ్యాటరీ, ఆర్కేబీచ్‌, తెన్నేటిపార్కు, జోడుగుళ్లపాలెం, రుషికొండ వంటి ప్రాంతాల్లో నిత్యం ఎంతోమంది స్నానాలకు దిగుతుంటారు. నగరానికి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు ఎవరైనా సరే ముందుగా బీచ్‌కు వెళ్లి ఆహ్లాదంగా గడపాలని పరితపిస్తుంటారు. బీచ్‌కు వెళ్లిన తర్వాత ఒడ్డున కూర్చోగానే ఎగసిపడుతున్న కెరటాలను చూసి తన్మయత్వానికి గురై సముద్రంలో దిగుతుంటారు. బీచ్‌ స్వరూపం కారణంగా స్నానాలు చేసేందుకు అనువుగా లేకపోవడం, ఆటు పోట్ల సమయంలో ఆకస్మికంగా ఎగసిపడే కెరటాలు.. స్నానాలకు దిగినవారి ప్రాణాలను హరిస్తున్నాయి.

విశాఖలో బీచ్‌ను సందర్శించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దానిని తగ్గట్టుగా వసతులు కల్పించకపోవడం, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో సందర్శకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నగర పరిధిలోనే 2019లో 18 మంది, 2020లో 18, 2021లో 13 మంది నీటిలో మునిగి చనిపోయారు. తాజాగా ఆదివారం నలుగురు గల్లంతు కావడం, వీరిలో ఇద్దరు మృతిచెందడంతో బీచ్‌లో భద్రతా ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. బీచ్‌ను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటకులకు అవసరమైన భద్రత, ఇతర సదుపాయాలను కల్పించాల్సిన పోలీస్‌, జీవీఎంసీ, పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపం కారణంగా బీచ్‌ అంటే మృత్యుకుహరంగా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

అరకొరగా హెచ్చరిక బోర్డులు

భౌగోళిక స్వభావంతోపాటు స్నానాలకు దిగేందుకు ఎక్కడ అనుకూలం, ఎక్కడ ప్రమాదకరమనేది పర్యాటకులు గుర్తించేందుకు అవకాశం ఉండదు. దీనిపై సముద్ర అధ్యయన విభాగం, మెరైన్‌, నేవీ వంటి శాఖల నుంచి సలహాలు తీసుకుని బీచ్‌ పొడువునా హెచ్చరికబోర్డులు, సూచన బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంది. బీచ్‌ స్వభావంపై పర్యాటలకు అవగాహన కలిగేలా బీచ్‌లో ప్రతీచోటా దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచాలి. గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ తర్వాత కాలంలో నిర్వహణ లేకపోవడంతో చాలావరకూ కనుమరుగైపోయాయి. దీనివల్ల బీచ్‌లో ఎక్కడ స్నానాలు చేయాలి.... ఎక్కడ దిగితే ప్రమాదకరమనే విషయాలపై సందర్శకులకు అవగాహన లేక స్నానాలకు దిగి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. నగరంలో అనవసర ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న పర్యాటక, జీవీఎంసీ అధికారులు... బీచ్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు స్వల్ప మొత్తాన్ని వెచ్చించేందుకు వెనుకాడడం శోచనీయమని నగరవాసులు, పర్యాటకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు... తర్వాత ఆ విషయాన్ని మరిచిపోవడం సాధారణమైపోయింది.

ఆచరణకు నోచుకుని వాచ్‌టవర్‌

బీచ్‌లో మరణాలను తగ్గించడంతోపాటు ఆపదలో చిక్కుకున్నవారిని సకాలంలో గుర్తించి సహాయ చర్యలు అందించేందుకు బీచ్‌లో వాచ్‌టవర్‌ ఏర్పాటుచేయాలని కొన్నేళ్ల కిందట ప్రతిపాదనలు రూపొందించారు. ఈ వాచ్‌టవర్‌పై నిత్యం ఇద్దరు పోలీసులు పహారా కాయడంతోపాటు వారికి బైనాక్యులర్స్‌, సముద్రంలో ప్రాణాపాయస్థితిలో వున్నవారిని రక్షించేందుకు సిబ్బందికి స్విమ్‌ సూట్‌ వంటి పరికరాలను అందజేయాలని భావించారు. వీటిని భద్రపరిచేందుకు వాచ్‌టవర్‌ కింది భాగంలో ఒక గదిని కూడా నిర్మించేలా ప్లాన్‌ రూపొందించారు. అయితే ఇది ప్రతిపాదనలతోనే ఆగిపోయింది. దీనిపై పోలీసులు పలుమార్లు ప్రస్తావించినా జీవీఎంసీ నుంచి స్పందన లేకపోవడంతో మిన్నకుండిపోయారు. కాగా లైఫ్‌జాకెట్లు వంటివి అందుబాటులో వుంటే ప్రమాదంలో చిక్కుకున్నవారిని గుర్తించి సమీపంలో వున్నవారు వాటి సహాయంతో రక్షించేందుకు వీలుంటుంది. తీరంపొడువునా ప్రతి 15 మీటర్ల దూరానికి ఒక లైఫ్‌గార్డును ఏర్పాటుచేయాలి. దీనివల్ల సమీపంలో ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు వీలుంటుందని ఆలోచించారు. దీనిపైనా జీవీఎంసీ, పోలీస్‌ అధికారులు దృష్టిసారించలేదు.


ప్రతిపాదనల్లోనే ‘బీచ్‌ పోలీసు’ విభాగం

పర్యాటక రంగానికి బీచ్‌ అత్యంత కీలకమైనది కావడంతో బీచ్‌కు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ‘బీచ్‌ పోలీసు’ పేరుతో పర్యాటకశాఖ కొత్త విభాగం ఏర్పాటుకు ప్రతిపాదించింది. కొంతమంది గజఈతగాళ్లను బీచ్‌ పొడువునా నియమించి వారికి జీతభత్యాలు, రక్షించేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను ఇచ్చేందుకు పర్యాటక శాఖ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పర్యాటక ప్రాంతాలు, రవాణా, వసతికి సంబంధించిన సమాచారం కూడా పర్యాటకులకు తెలిపేలా ఇక్కడే సదుపాయాలు కల్పించేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా దీనిపై పురోగతి కనపించడంలేదు. 


మూడంచెల భద్రత ఏర్పాటుచేశాం : గౌతమీశాలి, డీసీపీ-1

బీచ్‌లో ప్రమాదాలను నియంత్రించేందుకు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేశాం. బీచ్‌లో సందర్శకుల తాకిడి ఎక్కువగా వుండే శని, ఆదివారాలతోపాటు సెలవురోజుల్లో బీచ్‌లో 200 మంది సిబ్బందితో శాండ్‌పార్టీ, రోడ్‌ పార్టీ, రూఫ్‌టాప్‌ పార్టీలను ఏర్పాటుచేశాం. భవనాలపై నుంచి బైనాక్యులర్స్‌తో బీచ్‌లో స్నానాలకు దిగేవారిని గుర్తించే బృందం ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే సమీపంలోని శాండ్‌ పార్టీకి సమాచారం ఇస్తుంది. దీనివల్ల ఆపదలో వున్న వారిని వెంటనే రక్షించేందుకు వీలుంటుంది. ఆదివారం అమావాస్య కావడంతో కెరటాల ఉదృతి ఎక్కువగా ఉంది. దీనిపై సందర్శకులకు అవగాహన లేకపోవడంతో లోపలకు వెళ్లడంవల్ల ప్రమాదం జరిగింది. 


Read more