జగనన్నా.. ఇల్లు నిర్మించేదెలాగన్నా!

ABN , First Publish Date - 2022-04-24T06:15:07+05:30 IST

అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46,331 మంది జగనన్న గృహ లబ్ధిదారులు ఉన్నారు. గ్రామాల శివారులో లబ్ధిదారులకు స్థలాలు కేటాయించడంతో చాలా మంది నిర్మాణం చేపట్టేందుకు వెనుకడుగు వేశారు.

జగనన్నా.. ఇల్లు నిర్మించేదెలాగన్నా!
ముకుందపురంలో నత్తనడకన గృహ నిర్మాణాలు

- పెరిగిన సిమెంట్‌, స్టీల్‌ ధరలు

- ప్రభుత్వం ఇచ్చే రూ. లక్షా 80 వేలతో ఇంటి నిర్మాణం సాధ్యంకాదని లబ్ధిదారుల గగ్గోలు

- అప్పులు చేసి నిర్మించుకున్నా ఇక్కడ ఉండలేమని ఆవేదన

- నిర్మాణం చేపట్టకపోతే స్థలం రద్దు చేస్తామని అధికారుల బెదిరింపులతో అయోమయం



జగనన్న గృహ లబ్ధిదారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా ఉంది. ఇల్లు నిర్మించుకోకపోతే స్థలాన్ని రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తుంటే, ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల్లో ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు తల పట్టుకుంటున్నారు. సిమెంట్‌, ఇనుము ధరలు పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అప్పులు చేసి నిర్మించుకున్నా మౌలిక వసతులు లేని కాలనీలో ఉండలేమని వాపోతున్నారు.


(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46,331 మంది జగనన్న గృహ లబ్ధిదారులు ఉన్నారు. గ్రామాల శివారులో లబ్ధిదారులకు స్థలాలు కేటాయించడంతో చాలా మంది నిర్మాణం చేపట్టేందుకు వెనుకడుగు వేశారు. అయితే ఇల్లు కట్టుకోకపోతే స్థలాలను రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తుండడంతో కొందరు పనులు ప్రారంభించారు. ఎటువంటి సదుపాయాలు లేకపోయినా ముందడుగు వేశారు. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయలు సిమెంట్‌, స్టీల్‌, ఇసుకకు సరిపోదని తెలిసినా అప్పులు చేసి పనులు చేపడుతున్నారు. అయితే ఇటీవల సిమెంట్‌, స్టీల్‌ ధరలు పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం సూచించిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అప్పులు చేసి నిర్మిస్తే ఇక్కడ సౌకర్యాలు లేనందున ఉండడం కూడా కష్టమని పలువురు వాపోతున్నారు. సిమెంట్‌, స్టీల్‌ను గృహ నిర్మాణ సంస్థ అధికారులు పంపిణీ చేస్తున్నా అవి ఎటూ సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 

ధరలు పెరగడంతో..

గతేడాది జూన్‌ నెలలో వైజాగ్‌ స్టీల్‌ టన్ను ధర రూ.65 వేల నుంచి రూ.70 వేలు మధ్య ఉండేది. ఇతర స్టీల్‌ టన్ను ధర రూ.55 వేలు నుంచి రూ.60 వేలు మధ్య ధర ఉండేది. ప్రస్తుతం టన్ను స్టీల్‌ ధర రూ.90 వేలు పలుకుతోంది. ఇతర కంపెనీల స్టీల్‌ రూ.70 వేలు తక్కువ లేదు. గతేడాది ఇదే నెలలో బస్తా 53 గ్రేడ్‌ సిమెంట్‌ ధర రూ.270 ఉంటే, ఇప్పుడు మార్కెట్‌లో రూ.350 ధర పలుకుతోంది. రవాణా ఖర్చులు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుందని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలను చూసి లబ్ధిదారులు నిర్మాణ పనులకు వెనుకంజ వేస్తున్నారు. ఎలక్ట్రికల్‌ వస్తువుల ధరలు గతం కంటే 25 శాతం నుంచి 30 శాతం పెరిగాయి. వైర్లు, స్విచ్‌లు, విద్యుత్‌ దీపాలు, ప్యానల్‌ బోర్డుల ధరలు కూడా భారీగానే పెరిగాయి. 

లక్ష్యానికి దూరం

అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46,331 గృహాలు మంజూరు కాగా, కేవలం 27 మాత్రమే పూర్తయ్యాయి. 6,716 రూఫ్‌ లెవిల్‌లో ఉన్నాయి. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 


----

ఇల్లు పూర్తి చేస్తామనే నమ్మకం లేదు (23ఏకేపీ.4)

ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టానా పూర్తవుతుందనే నమ్మకం లేదు. సిమెంట్‌, ఇనుము రేటు బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమూలకు సరిపోవు. ఇప్పటికే అప్పులు చేసి బేస్‌మెంట్‌ పని చేశాం. కొద్ది రోజులు పని ఆపేద్దామని నిర్ణయించుకున్నాం.

- రత్తుల రమణమ్మ, మాకవరపాలెం


ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి (ఫొటో- 23.ఏకేపీ2)

ఇంటి పని ప్రారంభించిన నాటి నుంచి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ముందుగా పని చేస్తేనే తరువాత ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇప్పటికే రూ.50 వేలు ఖర్చు అయింది. ఇనుము, సిమెంట్‌ అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ధరలు పెరగడంతో అప్పులు చేయకతప్పడం లేదు.

- పట్నాల చిన్నారి, ముకుందపురం, మాడుగుల మండలం


Updated Date - 2022-04-24T06:15:07+05:30 IST