సుగంధ ద్రవ్యాల నిలయమిది

ABN , First Publish Date - 2022-11-30T01:07:53+05:30 IST

గిరిజన ప్రాంతం సుగంధ ద్రవ్యాలకు నిలయమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. కేంద్ర స్పైసెస్‌ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక హోటల్‌లో మిరియాల ఉత్పత్తుల కొనుగోలుదారులు, విక్రయదారుల రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహిస్తే అల్లూరి జిల్లా కేరళ రాష్ట్రాన్ని మించిపోతుందన్నారు. ఇక్కడి గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీడీఏ సహకారంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించే విధంగా సేంద్రీయ కాఫీ, మిరియాలను సాగు చేస్తున్నారన్నారు. వాణిజ్య సంస్థలు నేరుగా గిరిజనుల నుంచి కాఫీ, మిరియాలు కొనుగోలు చేయాలని సూచించారు.

సుగంధ ద్రవ్యాల నిలయమిది
సదస్సులో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

సాగును ప్రోత్సహిస్తే కేరళకు దీటుగా అల్లూరి జిల్లా

- కేంద్ర స్పైసెస్‌ బోర్డు సదస్సులో జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

- మిరియాలకు కాఫీ కంటే అధిక ధర : కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

అరకులోయ, నవంబరు 29: గిరిజన ప్రాంతం సుగంధ ద్రవ్యాలకు నిలయమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. కేంద్ర స్పైసెస్‌ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక హోటల్‌లో మిరియాల ఉత్పత్తుల కొనుగోలుదారులు, విక్రయదారుల రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహిస్తే అల్లూరి జిల్లా కేరళ రాష్ట్రాన్ని మించిపోతుందన్నారు. ఇక్కడి గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీడీఏ సహకారంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించే విధంగా సేంద్రీయ కాఫీ, మిరియాలను సాగు చేస్తున్నారన్నారు. వాణిజ్య సంస్థలు నేరుగా గిరిజనుల నుంచి కాఫీ, మిరియాలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొనుగోలుదారులు, విక్రయదారుల సదస్సు నిర్వహిస్తే దళారీ వ్యవస్థ తగ్గుముఖం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులు చేతికి వచ్చిన వెంటనే విక్రయించకుండా కొంత కాలం వేచి ఉంటే మంచి ధర వస్తుందన్నారు. మిరియాలకు కాఫీ కంటే అధిక ధర లభిస్తుందన్నారు. ఏజెన్సీలో 4800 మెట్రిక్‌ టన్నుల మిరియాలు, 90 వేల మెట్రిక్‌ టన్నుల పసుపు ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి మిరియాలు క్రయవిక్రయాలపై అవగాహన కల్పిస్తామన్నారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ గిరిజన రైతులకు ఆర్థిక సహాయం అందించి గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. మిరియాల సేకరణకు నిచ్చెనలు సరఫరా చేయాలని అధికారులను కోరారు. ట్రైకార్‌ చైర్మన్‌ బుల్లిబాబు మాట్లాడుతూ తొమ్మిది మండలాల్లో గిరిజన రైతులు మిరియాలు సాగు చేస్తున్నారని చెప్పారు. జిల్లా పరిధిలో స్పైసెస్‌ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొనుగోలుదారులు, విక్రయదారులు, గిరిజన రైతులతో గిట్టుబాటు ధరలపై కలెక్టర్‌ చర్చించారు. ఈ కార్యక్రమంలో సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్‌ జోజి మాథ్యూ, నితన్‌ జోయ్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ వీకే దుబాసీ, సహాయ సంచాలకులు వీవీ జీషన, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ కల్యాణి, ఫుడ్‌ అండ్‌ అగ్రో మేనేజర్‌ వినయ్‌సింగ్‌, పద్మాపురం సర్పంచ్‌ సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:07:55+05:30 IST