ఇష్టారాజ్యం.. చర్యలు పూజ్యం!

ABN , First Publish Date - 2022-08-01T06:30:09+05:30 IST

అసలే రద్దీ రహదారి.. ఆపై ఇష్టారాజ్యంగా వాహనాల నిలిపివేత.. వెరసి.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పరవాడ, లంకెలపాలెం మండలాల ప్రజలు హడలిపోతున్నారు.

ఇష్టారాజ్యం.. చర్యలు పూజ్యం!
పరవాడ మండల పరిషత్‌ కార్యాలయం జంక్షన్‌లో రహదారిపైనే లారీలు

రద్దీ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేస్తున్న డ్రైవర్లు 

పరవాడ, లంకెలపాలెం మండలాల ప్రజలను వెంటాడుతున్న  ప్రమాదాల భయం

పట్టించుకోని అధికార యంత్రాంగం

పరవాడ, జూలై  31 : అసలే రద్దీ రహదారి.. ఆపై ఇష్టారాజ్యంగా వాహనాల నిలిపివేత.. వెరసి.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పరవాడ, లంకెలపాలెం మండలాల ప్రజలు హడలిపోతున్నారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాం తాల్లో అందుకు అనుగుణంగానే వాహనాల రాకపోకల సంఖ్య పెరిగింది. ఫలితంగా నిత్యం సందడి వాతావరణమే నెలకొంటుంది. అయితే కొందురు వాహనదారులు తమ పనుల నిమిత్తం రోడ్ల పక్కన వాహనాలను నచ్చిన రీతిలో పార్కింగ్‌ చేస్తున్నారు. పరవాడ మండల పరిషత్‌ కార్యాలయం జంక్షన్‌లో ఈ సమస్య మరీ అధికంగా ఉంది.  ప్రధాన రహదారిపైనే భారీ వాహనాలు నిలుపుదల చేస్తుండడంతో వచ్చీపోయే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలావుంటే కొందరు డ్రైవర్లు వాహనాలను గంటల కొద్దీ నిలిపివేసి సమీపంలో ఉన్న దుకాణాల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా మండల పరిషత్‌ కార్యాలయం జంక్షన్‌ నుంచి లంకెలపాలెం వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం వాహనాలు బారులుతీరి కనిపిస్తున్నాయి. రాత్రివేళలో అయితే మరి చెప్పన క్కర్లేదు. దీనికితోడు లంకెలపాలెం నుంచి పరవాడ వైపు వచ్చే వాహనాలు అతి వేగంగా రాకపోకలు సాగిస్తుండడం మరింత భయాందోళనకు కార ణమవుతోంది. ఈ క్రమంలో రహదారిపై జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసు అధికారులు మరింత దృష్టి సారించి రోడ్లపక్కన వాహనాలు నిలపకుండా చర్యలు  చేపట్టాలని అంతా కోరుతున్నారు. 

Read more