వానొచ్చినా.. మ్యాచ్‌ ఆగదు

ABN , First Publish Date - 2022-06-12T06:31:25+05:30 IST

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 14న పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి క్రీడాభిమానుల ఆదరణ పొందడానికి నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

వానొచ్చినా.. మ్యాచ్‌ ఆగదు
అవుట్‌ ఫీల్డ్‌లో నీటిని తోడే సఫర్‌ యంత్రం

టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న నిర్వాహకులు

మధురవాడ, జూన్‌ 11: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 14న పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి క్రీడాభిమానుల ఆదరణ పొందడానికి నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా జూన్‌ నెలలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో క్రికెట్‌ మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ఒకవేళ వర్షం కురిసినా 30 నిమిషాల్లో మళ్లీ అవుట్‌ఫీల్డ్‌, పిచ్‌ను ఆటకు సిద్ధం చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నీటిని పచ్చికపై పీల్చుకునే రెండు సఫర్‌ యంత్రాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా మొత్తం అవుట్‌ఫీల్డ్‌, పిచ్‌ను కవర్‌ చేయడానికి అవసరమైన టార్పాన్లను అవుట్‌ఫీల్డ్‌ అంచున వుంచడంతో పాటు మరికొంత నిడివి గల టార్పాన్‌ను రిజర్వ్‌లో ఉంచారు. సఫర్‌ యంత్రాలను ఓవర్‌ హాలింగ్‌ చేసి సిద్ధం చేశారు. వీటి టైర్లకు స్పాంజ్‌ వుండడంతో ఫీల్డ్‌పై వున్న వర్షపు నీటిని ఇవి త్వరితంగా పీల్చుకుని ప్రత్యేకంగా నీటిని పంపింగ్‌ చేసే ప్రాంతానికి యంత్రం చేరుకుంటుంది. అక్కడ వర్షపు నీటిని విడుదల చేసి మళ్లీ ఫీల్డ్‌పైకి వస్తుంది. ఈ విధంగా ఎంత వర్షం పడినా క్రికెట్‌ అభిమానులను నిరాశ పరచకుండా 30 నిమిషాల్లో తిరిగి మ్యాచ్‌ ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ పనులకు గాను సుమారు వంద మంది వరకు సిబ్బంది గ్రౌండ్‌ వద్ద సిద్ధంగా ఉంటారు.

చకచకా ఏర్పాట్లు..

టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు స్టేడియంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవుట్‌ ఫీల్డ్‌, పిచ్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. బ్యాట్స్‌మన్‌ ఏకాగ్రత దెబ్బతినకుండా స్డేడియం డబుల్‌ ఎండ్‌ల వద్ద బ్లాక్‌ సైడ్‌స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. ఇరు జట్ల క్రీడాకారులు కూర్చునేందుకు సిటవుట్‌లు సిద్ధం చేశారు. అవుట్‌ ఫీల్డ్‌కు రోలింగ్‌ చేస్తున్నారు.స్డేడియం ఆవరణలో పచ్చదనం కనిపించేలా చర్యలు చేపట్టారు. ఎలకా్ట్రనిక్‌ స్కోర్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు.
Read more