గిరి విద్యార్థినులకు హోమ్‌ నర్సింగ్‌ శిక్షణ

ABN , First Publish Date - 2022-10-08T06:12:44+05:30 IST

హోమ్‌ నర్సింగ్‌ కోర్సులో శిక్షణ పొందేందుకు గిరిజన విద్యార్థునులను రాజాం తరలించామని ఏఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ చెప్పారు.

గిరి విద్యార్థినులకు హోమ్‌ నర్సింగ్‌ శిక్షణ
ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్న ఏఎస్పీ

ఏఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌


చింతపల్లి, అక్టోబరు 7: హోమ్‌ నర్సింగ్‌ కోర్సులో శిక్షణ పొందేందుకు గిరిజన విద్యార్థునులను రాజాం తరలించామని ఏఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ చెప్పారు. శుక్రవారం చింతపల్లి, జీకే వీధి, పెదబయలు ప్రాంతాలకు చెందిన 35 మంది గిరిజన విద్యార్థినులను శిక్షణ కోసం పంపించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రేరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు పదో తరగతి పైబడి చదివిన విద్యార్థునులను జీఎంఆర్‌ సంస్థ సహకారంతో విజయనగరం జిల్లా రాజాం నరైడ్‌ శిక్షణ కేంద్రానికి పంపించామన్నారు. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు నెలకు రూ.15 వేల వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అలాగే స్థానిక వైటీసీలో టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధులు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థినులు హాజరుకావాలని ఆయన సూచించారు.


మిస్సింగ్‌ కేసు ఛేదించిన పోలీసులకు నగదు ప్రోత్సాహాలు

ఏడాది క్రితం నమోదైన మిస్సింగ్‌ కేసును ఛేదించిన అన్నవరం ఎస్‌ఐ సాయికుమార్‌, కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహాలను ఏఎస్పీ అందించారు. కేసు విచారణలో హత్య ఉదంతాన్ని చాకచక్యంగా వెలికితీసిన ఎస్‌ఐతో ఏఎస్‌ఐ జి.రమణమూర్తి, కానిస్టేబుళ్లు కన్నారావు, కొండందొర, శంకరరావు, రాములను అభినందించి నగదు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో గూడెంకొత్తవీధి, చింతపల్లి సీఐలు అశోక్‌కుమార్‌, సన్యాసినాయుడు, ఎస్‌ఐ మహ్మద్‌ అలీ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T06:12:44+05:30 IST