హార్బర్‌పై పెత్తనం!

ABN , First Publish Date - 2022-08-31T06:10:20+05:30 IST

రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌పై పెత్తనం చెలాయించాలని కొందరు వైసీపీ నాయకులు చూస్తున్నారు.

హార్బర్‌పై పెత్తనం!
వసూళ్లపై ఎమ్మెల్యే వాసుపల్లికి ఫిర్యాదు చేస్తున్న చిరువ్యాపారులు

బెదిరింపులు...రూ.లక్షల్లో వసూళ్లు 

ఎవరికీ రూపాయి కూడా ఇవ్వొద్దని ఎమ్మెల్యే స్పష్టీకరణ

ఆయనకు ఏం సంబంధమన్న మరపడవల సంఘం అధ్యక్షుడు

అసోసియేషన్లకు హక్కు లేదన్న మత్స్య శాఖ


విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌పై పెత్తనం చెలాయించాలని కొందరు వైసీపీ నాయకులు చూస్తున్నారు. ఏపీ మరపడవల సంఘం బాధ్యతల కోసం ఎప్పటినుంచో కాచుకు కూర్చున్న నేతలు పదవి దక్కగానే గంగమ్మ జాతర పేరుతో మత్స్యకారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. తాజాగా హార్బర్‌ అభివృద్ధి పేరుతో నెలకు రూ.వేయి నుంచి రూ.5 వేలు ఇవ్వాలని అక్కడ వ్యాపారాలు చేసుకునే వారిని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిని చిరు వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశాలపై ‘ఫిషింగ్‌ హార్బరులో అక్రమ వసూళ్లు’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం మత్స్యకార వర్గాల్లో చలనం కలిగించింది. హార్బర్‌లో వ్యాపారాలు చేసుకునే వారంతా మూకుమ్మడిగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తరతరాలుగా ఫిషింగ్‌ హార్బర్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఏనాడూ ఏ ఒక్కరూ ఇలా డబ్బులు డిమాండ్‌ చేయలేదని, ఇప్పుడు కొత్తగా బెదిరిస్తున్నారని ఆయనకు వివరించారు. దానిపై స్పందించిన ఆయన...మత్స్యకారులకు నష్టం కలిగే పనులు ఏమీ ప్రభుత్వం చేయదని, హార్బర్‌లో ఎవరికీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తానన్నారు. దాంతో చిరువ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.


హైలెవెల్‌ కమిటీ ఆదేశంతోనే...

జానకీరామ్‌, ఏపీ మరపడవల సంఘం అధ్యక్షులు


హార్బర్‌ అభివృద్ధికే తాము డబ్బులు అడుగుతున్నామని, దానిని కొన్ని వర్గాలు రాజకీయం చేస్తున్నాయని జానకీరామ్‌ ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ హై లెవెల్‌ కమిటీ సూచించిన ఫీజులే తాము అడుగుతున్నామంటూ కొన్ని పేపర్లు చూపించారు. ఎవరికీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన ప్రకటనను విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, ‘ఇది మత్స్యకారులు...హార్బర్‌కు సంబంధించిన అంశమని, మధ్యలో ఎమ్మెల్యే చెప్పడానికి ఎవరు?’’ అంటూ జానకీరామ్‌ ప్రశ్నించారు. తాను రూ.640 కోట్ల వ్యాపారం చేసే హార్బర్‌కు అధ్యక్షుడినని, ఇక్కడ ఏదైనా తన నిర్ణయమే వుంటుందని స్పష్టంచేశారు. 


హార్బరులో 26 సంఘాలు

ఫిషింగ్‌ హార్బర్‌ను విశాఖపట్నం పోర్టు నిర్మించింది. నిర్వహిస్తోంది. అక్కడ ఎవరికైనా లీజుకు స్థలం లేదా భవనం కావాలంటే పోర్టు కేటాయిస్తుంది. అందుకు అద్దె చెల్లించాలి.  వేలాది మంది ఆధారపడి జీవిస్తున్న హార్బర్‌లో మొత్తం 26 సంఘాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి మూడు. ఏపీ మెకనైజ్డ్‌ బోటు ఆపరేటర్ల సంఘం, విశాఖ డాల్ఫిన్‌ బోటు ఆపరేటర్ల సంఘం, కోస్టల్‌ మెకనైజ్డ్‌ ఆపరేటర్ల సంఘం అని ఉన్నాయి. బోటు యజమానులు ఇందులో సభ్యులు. ఇవి కాకుండా కలాసీలు, వేలంపాటదారులు, చేపల విక్రేతలు, ఐస్‌ అమ్మకందారులు...ఇలా...ఎవరికి వారు మరో 23 సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏ సంఘమైనా వారి సభ్యుల బాగోగులు చూసుకోవాలి. అంతే తప్ప...‘మొత్తం హార్బర్‌ మాదే...మేము చెప్పినట్టు అంతా వినాలి.’ అనే ధోరణి ఇప్పటివరకు లేదు. ఏపీ మెకనైజ్డ్‌ బోటు ఆపరేటర్ల సంఘానికి దాదాపు మూడు దశాబ్దాలు కొందరు సారధ్యం వహించారు. ఏనాడూ ఇలాంటి వివాదాలు రాలేదు. ఈ సంఘానికి బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా పూర్తి కాకముందే హార్బర్‌ మొత్తం తమదేనని ప్రకటించుకోవడం, వసూళ్లు తమ ఇష్టమని చెప్పడం ఇటీవలె మొదలైంది. దీనిని మిగిలిన సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. 


ఏ సంఘానికీ హక్కు లేదు

గోవిందరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, మత్స్య శాఖ


ఫిషింగ్‌ హార్బర్‌లో డబ్బులు వసూలు చేసే అధికారం ఏ సంఘానికీ లేదు. అలా చేస్తే అది తప్పు. ఫిషింగ్‌ హార్బర్‌ను అభివృద్ధికి...యూజర్‌ చార్జీలు వసూలు చేస్తే బాగుంటుందనే ఆలోచన కరోనాకు ముందు జరిగిన హైలెవెల్‌ కమిటీ అధికారుల సమావేశంలో వచ్చింది. ఎవరి నుంచి ఎంత వసూలు చేయాలనే దానిపై ఒక నమూనా రూపొందించాము. దానిపై చర్చించి, అభిప్రాయాలు తీసుకోవాలని అనుకున్నాము. కానీ కరోనా వల్ల అది ముందుకు సాగలేదు. ఇటీవల నెల రోజుల క్రితం రింగ్‌ వలల సమస్యపై మత్స్య శాఖా మంత్రి సీదరి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో మళ్లీ ఇది చర్చకు వచ్చింది. యూజర్‌ చార్జీల వసూళ్లపై ఒక సబ్‌ కమిటీని వేసి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ సబ్‌ కమిటీలో చాలామంది మత్స్యకార సంఘాల నాయకులు ఉన్నారు. సబ్‌ కమిటీ ఇంకా అధ్యయనం చేయలేదు. యూజర్‌ చార్జీల వసూలు ప్రతిపాదించలేదు. ఒకవేళ అలా ఏమైనా చార్జీలు పెడితే.. అప్పుడు కూడా వాటిని అయితే విశాఖపట్నం పోర్టు లేదా రాష్ట్ర మత్స్య శాఖ వసూలు చేస్తాయి. వాటిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై కూడా నిబంధనలు ఉంటాయి. అంతే తప్ప హార్బర్‌ అభివృద్ధి పేరుతో ఏ సంఘం కూడా డబ్బులు వసూలు చేయడం తగదు. ఎవరికీ ఆ హక్కు లేదు.

Read more