ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-17T06:41:50+05:30 IST

నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్‌ పి.రాజాబాబు అన్నారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటున్న రాజాబాబు

నగరవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తా

ఏయూ పూర్వ విద్యార్థినే...

నగరంపై అవగాహన ఉంది

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తా

జీవీఎంసీ నూతన కమిషనర్‌ పి.రాజాబాబు


విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్‌ పి.రాజాబాబు అన్నారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన తన ప్రాధాన్యాలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖకు గుర్తింపు ఉందన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఆరోగ్య సంబంధిత సమస్యలపై దృష్టిసారిస్తానన్నారు. నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల సేవలు అందజేసేందుకు అధికారులతో కలిసి కృషిచేస్తానన్నారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. మేయర్‌, కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తానన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలతోపాటు, ప్రజా ప్రతినిధులు లేవనెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తానన్నారు. గత కమిషనర్‌ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులతోపాటు ప్లాస్టిక్‌ నిషేధం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు. తాను ఏయూ పూర్వ విద్యార్థినని, నగరంపైనా, శివారు ప్రాంతాలపైనా అవగాహన ఉందన్నారు. ఆ అనుభవంతో నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానన్నారు. జీవీఎంసీలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడి నుంచి జీవీఎంసీకి చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన...మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్‌ను అదనపు కమిషనర్లు డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ వి.సన్యాసిరావు, వర్మతోపాటు అన్ని విభాగాల అధిపతులు, అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. 

Read more