రూ.4,060 కోట్లతో జీవీఎంసీ బడ్జెట్‌

ABN , First Publish Date - 2022-11-24T01:44:32+05:30 IST

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్‌ ముసాయిదాను అధికారులు తయారుచేశారు.

రూ.4,060 కోట్లతో జీవీఎంసీ బడ్జెట్‌

ముసాయిదా సిద్ధం

స్టాండింగ్‌ కమిటీ ఆమోదానికి పంపిన కమిషనర్‌

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్‌ ముసాయిదాను అధికారులు తయారుచేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...రూ.4,060 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను కమిషనర్‌ ఆమోదించినట్టు తెలిసింది. ఇది గత ఏడాదితో పోల్చితే రూ.కోటి తక్కువ. బడ్జెట్‌ తయారీపై కమిషనర్‌ పి.రాజాబాబు జీవీఎంసీలోని అన్ని విభాగాల అధికారులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు స్వీకరించారు. వారిచ్చిన ప్రతిపాదనల మేరకు ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం అధికారులు రూ.4,060 కోట్లతో బడ్జెట్‌ ముసాయిదాను రూపొందించి కమిషనర్‌కు పంపించారు. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తాయని అంచనా వేసిన గ్రాంట్లు రాలేదు. అలాగే పలు ప్రాజెక్టులను బడ్జెట్‌లో చూపించినప్పటికీ పనులు జరగలేదు. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ తొలగించి వాస్తవ బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులు భావించారు. అయితే గత ఏడాది కంటే బడ్జెట్‌ను తగ్గిస్తే ప్రజలు, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అధికారులు వెనకడుగు వేశారు. గత ఏడాదికంటే కోటి మాత్రమే తగ్గించి బడ్జెట్‌ ముసాయిదాను తయారుచేయడం విశేషం. కమిషనర్‌ దీనికి ఆమోదం తెలపడంతో స్టాండింగ్‌ కమిటీ ఆమోదం కోసం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారికి పంపించారు. వచ్చే నెల రెండున జరిగే స్టాండింగ్‌ కమిటీలో దీన్ని పరిశీలించి అభ్యంతరాలు వుంటే వెనక్కి పంపిస్తారు. లేనిపక్షంలో స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపి కౌన్సిల్‌ ఆమోదానికి పంపిస్తుంది. జనవరి చివరి వారంలో కౌన్సిల్‌ ఆమోదం తీసుకుని ఫిబ్రవరి లేదా మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాగా బడ్జెట్‌ ముసాయిదాకు సంబంధించిన వివరాలను కౌన్సిల్‌ ఆమోదానికి ముందు బయటకు వెల్లడించడానికి అధికారులు విముఖత వ్యక్తంచేయడంతో ఏఏ విభాగాలకు ఎంత కేటాయించారనే వివరాలు తెలియరాలేదు.

Updated Date - 2022-11-24T01:44:32+05:30 IST

Read more