గోతుల్లో దిగబడిన భారీ వాహనాలు

ABN , First Publish Date - 2022-09-08T06:47:26+05:30 IST

తాళ్లపాలెం-నర్సీపట్నం మధ్య బుధవారం ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది.

గోతుల్లో దిగబడిన భారీ వాహనాలు
తాళ్లపాలెం వద్ద నిలిచిపోయిన వాహనాలు.

తాళ్లపాలెం- నర్సీపట్నం మధ్య ఐదు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్‌

తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు

కశింకోట, సెప్టెంబరు 7: తాళ్లపాలెం-నర్సీపట్నం మధ్య బుధవారం ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. తాళ్లపాలెం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో భారీ వాహనం ఒకటి కూరుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విశాఖలోని గంగవర పోర్టు నుంచి మాకవరపాలెం మండలంలోని అన్‌రాక్‌ కంపెనీకి భారీ వాహనాల్లో బాక్సైట్‌ రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఒక వాహనం బుధవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తాళ్లపాలెం సంత సమీపంలో రోడ్డు మఽధ్యలో ఏర్పడిన భారీ గొయ్యిలో దిగబడిపోయింది. దీని పక్క నుంచి వెళుతూ మరో లారీ కూడా కూరుకుపోయింది. దీంతో అటు నర్సీపట్నం, ఇటు తాళ్లపాలెం వైపు నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 108 వాహనం కూడా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో రోగులను తిరిగి వెనక్కు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న కశింకోట ఎస్‌ఐ ఎ.ఆదినారాయణరెడ్డి... మూడు ఎక్స్‌కవేటర్లు, ఒక క్రేన్‌ను రప్పించి గోతిలో దిగబడిన లారీలను బయటకు తీయించారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.  


Updated Date - 2022-09-08T06:47:26+05:30 IST