సబ్బవరంలో గ్రావెల్‌ మాఫియా

ABN , First Publish Date - 2022-11-21T00:51:39+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతోంది. కొండవాలు ప్రాంతాలు, బంజరు భూములు.. చివరకు జగనన్న ఇళ్ల కాలనీల లేవుట్లను వదలడం లేదు. ఎక్కడ గ్రావెల్‌ వుంటే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గంగవరం, గాలిభీమవరం, నంగినారపాడు ప్రాంతాల్లో రాత్రి పూట గ్రావెల్‌ తవ్వి, వెదుళ్లనరవ, దువ్వాడ సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పగటి పూట ఇక్కడ నుంచి దువ్వాడ, గాజువాక, అగనంపూడి, లంకెలపాలెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది.

సబ్బవరంలో గ్రావెల్‌ మాఫియా
గాలిభీమవరం సర్వే నంబరు 126లో గ్రావెల్‌ తవ్విన దృశ్యం

కొండవాలు ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు

జగనన్న కాలనీలనూ వదలని అక్రమార్కులు

రాత్రిపూట యంత్రాలతో తవ్వకాలు, వెదుళ్లనరవలో డంపింగ్‌

ఇక్కడి నుంచి దువ్వాడ, గాజువాక, అగనంపూడి, లంకెలపాలెం ప్రాంతాలకు సరఫరా

లారీ గ్రావెల్‌ రూ.3-4 వేలు, డంపర్‌ రూ.6-7 వేలకు విక్రయం

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ శాఖలు

సబ్బవరం, నవంబరు 20: మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతోంది. కొండవాలు ప్రాంతాలు, బంజరు భూములు.. చివరకు జగనన్న ఇళ్ల కాలనీల లేవుట్లను వదలడం లేదు. ఎక్కడ గ్రావెల్‌ వుంటే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గంగవరం, గాలిభీమవరం, నంగినారపాడు ప్రాంతాల్లో రాత్రి పూట గ్రావెల్‌ తవ్వి, వెదుళ్లనరవ, దువ్వాడ సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పగటి పూట ఇక్కడ నుంచి దువ్వాడ, గాజువాక, అగనంపూడి, లంకెలపాలెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది.

సబ్బవరం మండలంలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవు. కానీ గ్రావెల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. మండలంలోని గంగవరం సర్వే నంబర్లు 57 (116.03 ఎకరాలు), 58 (117.02 ఎకరాలు), 59 (279.35 ఎకరాలు)లలో కొండలు ఉన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో లేఅవుట్‌లు వేసి అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇంకా ఇళ్లు మంజూరుకాకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇక్కడ నాణ్యమైన గ్రావెల్‌ వుండడంతో అక్రమాల కన్ను పడింది. లేఅవుట్లలో ఇళ్ల స్థలాల సరిహద్దు రాళ్లను పీకేసి మరీ గ్రావెల్‌ తవ్వుతున్నారు. ఇంకా నంగినారపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 51(69.10 ఎకరాలు)లో ఏర్పాటు చేసిన లే-అవుట్‌కు అనుకొని ఉన్న కొండ నుంచి అర్ధరాత్రి వేళ గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. గాలిభీమవరం సర్వే నంబరు 126 (22.42 ఎకరాలు)లో కొండ ఉంది. ఇక్కడ గత కొన్ని రోజులుగా గ్రావెల్‌ తవ్వుతున్నారు. సమీపంలో జాతీయ రహదారి ఉండడంతో గ్రావెల్‌ రవాణా సులవుగా సాగిపోతున్నది. అదే విధంగా అసకపల్లి సర్వే నంబరు-1లోని కొండ నుంచి (న్యాయ విశ్వవిద్యాయం వెనుక, జగనన్న కాలనీకి అనుకొని) రాత్రి వేళల్లో గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. ఇంకా గాజువాక మండలం అగనంపూడి సర్వే నంబరు 155 (147.50 ఎకరాలు)లో కొండ నుంచి రాత్రి సమయాల్లో గ్రావెల్‌ తవ్వి అక్కడ నుంచి 88వ వార్డు పరిధి వెదుళ్లనరవ, దువ్వాడ సమీపంలో డంప్‌ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పగటి పూట లారీలు, టిప్పర్ల ద్వారా దువ్వాడ, గాజువాక, అగనంపూడి, లంకెలపాలెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లారీ గ్రావెల్‌ రూ.3-4 వేలు, డంపర్‌ (6 యూనిట్లు) రూ.6-7 వేలకు అమ్ముతున్నారు. అయినప్పటికీ మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి అయినా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

20 ఏసీపీ1ఏ: అచ్యుతాపురం మండలం మడుతూరులో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న దృశ్యం

మడుతూరులో గ్రావెల్‌ తవ్వకాలు

జనసేన నాయకురాలు అడ్డుకోవడంతో పరారైన అక్రమార్కులు

అచ్యుతాపురం, నవంబరు 20: మండలంలోని మడుతూరు సర్వే నంబరు 245లో 1.75 ఎకరాలు, సర్వే నంబరు 248లో 0.78 ఎకరాల గెడ్డవాగు ఉంది. అధికార పార్టీ నాయకులు గత నాలుగు రోజులుగా ఇక్కడి నుంచి గ్రావెల్‌ తవ్వుకుపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు మోటూరు శ్రీవేణి ఆదివారం అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు వాహనాలను విడిచిపెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. ఇక్కడ సుమారు 20 అడుగుల లోతున గ్రావెల్‌ తవ్వేశారని, తహసీల్దార్‌ని వాకబు చేయగా.. గ్రావెల్‌ తవ్వకాలకి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారని ఆమె చెప్పారు. దీనిపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-21T00:51:39+05:30 IST

Read more