పాఠశాలల నిర్వహణకు అరకొరగా గ్రాంటు

ABN , First Publish Date - 2022-09-25T06:51:35+05:30 IST

‘నాడు-నేడు’ పథకం కింద పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, వాటి నిర్వహణకు మాత్రం అరకొర గ్రాంటు విడుదల చేసింది.

పాఠశాలల నిర్వహణకు అరకొరగా గ్రాంటు

ఉమ్మడి జిల్ల్లాకు గతంలో రూ.11.9 కోట్ల వరకూ కేటాయింపు

ఈ ఏడాది రూ.3.08 కోట్లు విడుదల

ప్రాథమిక, యూపీ పాఠశాలలకు రూ.10 వేలు

ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు రూ.25 వేలు

సరిపోవంటున్న హైస్కూళ్ల హెచ్‌ఎంలు

గత ఏడాది రూ.లక్ష దాటిన చోట్ల బిల్లులు పెండింగ్‌


విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): 

‘నాడు-నేడు’ పథకం కింద పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, వాటి నిర్వహణకు మాత్రం అరకొర గ్రాంటు విడుదల చేసింది. వార్షిక గ్రాంటులో కేవలం 20 శాతం మాత్రమే విడుదల చేయడంపై ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా 300 కంటే ఎక్కువ మంది పిల్లలున్న హైస్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు. 

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను పాఠశాలల నిర్వహణ గ్రాంటు కింద రూ.2,23,90,000, స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రూ.52 లక్షలు, మండల రిసోర్స్‌ సెంటర్లకు రూ.32.2 లక్షలు వెరసి రూ.3,08,10,000 విడుదల చేశారు. వాస్తవంగా చూస్తే ఉమ్మడి జిల్లాకు ఏడాదికిగాను రూ.1119.5 లక్షలు విడుదల చేయాల్సి వుండగా దాంట్లో 20 శాతమే కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 46 మండల రిసోర్స్‌ సెంటర్లకు రూ.70 వేలు, స్కూలు కాంప్లెక్స్‌లకు రూ.20 వేలు చొప్పున మంజూరుచేశారు. మొత్తం 3,527 ప్రాథమిక, యూపీ పాఠశాలలకు రూ.10 వేలు వంతున, 563 ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు రూ.25 వేలు వంతున విడుదలైనట్టు సమగ్రశిక్షా అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో పాఠశాలల కమిటీల ఖాతాలకు నిధులు జమ చేస్తామన్నారు. 

పాఠశాలల నిర్వహణ కోసం గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. పాఠశాలల్లో విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ బిల్లుల చెల్లింపు, ఇంకా ఫ్యాన్లు, వాష్‌రూమ్‌లలో ట్యాప్‌లు, పైపులు, కంప్యూటర్లు మరమ్మతు, స్టేషనరీ ఖర్చుల కోసం ఈ గ్రాంటును ఉపయోగించుకోవాలి. ప్రాథమిక, యూపీ పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోతాయి. ఉన్నత పాఠశాలలకు వచ్చేసరికి విద్యార్థులు 150 నుంచి 250 మంది మధ్య వుంటే 80 నుంచి 90 శాతం వరకు సరిపోతాయి. అదే 300 మంది దాటిన ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు సరిపోవడం లేదు. ఇక 500, 1000 మంది విద్యార్థులుండే పాఠశాలల్లో నిర్వహణ గ్రాంటు సరిపోక అనధికారికంగా పిల్లల ప్రవేశాల సమయంలో కొంత మొత్తం వసూలు చేస్తుంటారు. జిల్లాలో 1500 మంది విద్యార్థులు గల తోటగరువు, చంద్రంపాలెం, గాజువాక, నడుపూరు జడ్పీ ఉన్నత పాఠశాలల నిర్వహణ విషయంలో ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. గత విద్యా సంవత్సరం వరకు ఒకేసారి మొత్తం గ్రాంట్‌ విడుదల చేసిన ప్రభుత్వం, ప్రస్తుత విద్యా సంవత్సరం 20 శాతమే ఇవ్వడంపై హెచ్‌ఎంలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాగా గత ఏడాది నిర్వహణ గ్రాంటు రూ.లక్ష దాటిన పాఠశాలలకు ఇంతవరకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చి నెలాఖరులో బిల్లులు పెడితే సీఎంఎఫ్‌ఎస్‌లో తిరస్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బిల్లులు విడుదల చేస్తామని చెప్పిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయారు. దీంతో గత ఏడాది రూ.లక్షకు మించి ఖర్చు చేసిన హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. 

Read more