దైవ దర్శనానికని వెళ్లి తిరిగిరాని లోకాలకు...

ABN , First Publish Date - 2022-02-19T06:33:32+05:30 IST

ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. దైవ దర్శనం కాకముందే లారీ రూపంలో కబళించింది.

దైవ దర్శనానికని వెళ్లి తిరిగిరాని లోకాలకు...

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాజువాక వాసులు మృతి

ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు

అక్క, తమ్ముడు, మేనకోడలు...

ఏడాది వయస్సున్న చిన్నారి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుపతి పయనం

అక్కడ నుంచి గోల్డెన్‌ టెంపుల్‌కు వెళుతుండగా ప్రమాదం

సాయంగా వెళ్లిన మరో వ్యక్తీ దుర్మరణం

గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు


ఉక్కుటౌన్‌షిప్‌/కూర్మన్నపాలెం/గాజువాక, ఫిబ్రవరి 18: 

ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. దైవ దర్శనం కాకముందే లారీ రూపంలో కబళించింది. ఏడాది వయసు కూడా రాని చిన్నారిని తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. సోదరుడు, సోదరి, ఆమె కుమార్తెతో పాటు స్నేహితుడినీ కుటుంబాలకు దూరం చేసింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ప్రమాదంతో తమ వారిని కోల్పోయిన గాజువాక సమీపంలోని శ్రీనగర్‌, పాత గాజువాకకు చెందిన వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

గాజువాక శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన పైడి ప్రేమకుమార్‌ (23), తన అక్క స్వాతి (25), ఆమె కుమార్తె శ్యామార్చిత (1), పాతగాజువాకకు చెందిన స్నేహితులు సునీల్‌కుమార్‌ (25), ఖాదర్‌వలీలు కలిసి గురువారం రైలులో తిరుపతి వెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. అయితే వీరికి తిరుమల శ్రీవారి దర్శనం శనివారం కావడంతో ఈలోగా గోల్డెన్‌ టెంపుల్‌ చూసేందుకు ఖాదర్‌ వలీ స్నేహితుడికి చెందిన కారులో బయలుదేరారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ముందు వెళుతున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో స్వాతి, ప్రేమకుమార్‌, సునీల్‌కుమార్‌, శ్యామార్చిత అక్కడికక్కడే మృతిచెందారు. ఖాదర్‌ వలీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమాచారం అందడంతో శ్రీనగర్‌లో వుంటున్న కుటుంబ సభ్యులు భోరున విలపిస్తూ చిత్తూరు బయలుదేరారు. 

ఇదిలావుండగా స్వాతి భర్త నారాయణ ఉపాధి నిమిత్తం సింగపూర్‌లో ఉంటున్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి శ్రీనగర్‌లోనే ఉంటున్నారు. నారాయణ, స్వాతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, నాలుగేళ్ల వయసున్న పెద్ద కుమార్తె పోషితను తల్లిదండ్రుల వద్ద ఉంచి, చిన్న కుమార్తె పుట్టు వెంట్రుకలను తిరుమలలో తీయించేందుకు సోదరుడు, అతడి స్నేహితుడితో కలిసి బయలుదేరింది. ప్రేమ్‌కుమార్‌ గాజువాకలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేస్తుండగా, సునీల్‌కుమార్‌ సెల్‌ రిపేర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు.  


మిన్నంటిన రోదనలు

చేతికి అందివచ్చిన కుమారుడు, కుమార్తె, మనుమరాళ్లను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకోవడాన్ని ప్రేమకుమార్‌, స్వాతి తల్లిదండ్రులు పైడి చంద్రరావు, సంధ్యారాణి జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడి మృతితో ఇక తాము బతికేదెలా అంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆటోడ్రైవర్‌గా బతుకు బండి ఈడుస్తున్న తనకు కుమారుడు అండగా నిలిచేవాడని, ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లలతో పాటు మనుమరాలు కూడా మృత్యువాత పడడంతో ఇక బతకడమెందుకుని చంద్రరావు గుండెలవిసేలా రోదించారు. అందరితో కలివిడిగా ఉంటూ, స్థానికులకు సుపరిచితుడైన ప్రేమ్‌కుమార్‌, అతడి సోదరి, ఆమె కుమార్తె మృతితో శ్రీనగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. 


పోషిత బేల చూపులు 

తాత, అమ్మమ్మ రోదిస్తుండడంతో ఏం జరిగిందో తెలియన స్వాతి పెద్ద కుమార్తె పోషిత బేల చూపులు చూస్తోంది. తల్లి, చెల్లి ఇక తిరిగిరారని తెలియని ఆ చిన్నారి, ఇంటినిండా చేరిన జనాన్నిచూసి బిత్తరపోతోంది. ఇదిలావుండగ భార్య, కుమార్తె, బావమరిది మృతిచెందిన వార్త తెలుసుకున్న సింగపూర్‌లోని నారాయణ కుప్ప కూలిపోయాడని కుటుంబ సభ్యులు వివరించారు. 


ఆ కుటుంబంలో తీవ్ర విషాదం

ప్రమాదంలో మృతిచెందిన సునీల్‌కుమార్‌ తల్లిదండ్రులు గోపి, సూర్యలక్ష్మి భోరున విలపిస్తున్నారు. స్నేహితుడికి సహాయంగా వెళ్తానంటే సరేనన్నామని, ఇలా తమను విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని ఊహించలేదని వారు రోదిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబానికి సెల్‌ రిపేర్‌ షాప్‌ పెట్టి అండగా నిలిచిన కుమారుడు మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా సునీల్‌కుమార్‌ చిన్నవాడు. పెద్ద కుమారుడు కూలిపనులు చేసుకుంటున్నాడు. పాత గాజువాకలో ఉంటున్నారు. 



Updated Date - 2022-02-19T06:33:32+05:30 IST