గర్భిణులకు అరకొర వైద్యం

ABN , First Publish Date - 2022-12-10T01:13:36+05:30 IST

మాతాశిశు మరణాలను సంపూర్ణంగా అరికట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌’ (పీఎంఎస్‌ఎంఏ) పథకం క్షేత్రస్థాయిలో అంతంతగానే అమలవుతున్నది. ప్రతి నెలా 9వ తేదీన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్బిణులకు స్కానింగ్‌తో సహా అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి.

గర్భిణులకు అరకొర వైద్యం
అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వేచి వున్న గర్భిణులు

పీఎంఎస్‌ఎంఏ పథకం కింద ప్రతినెలా 9వ తేదీన ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని కేంద్రం ఆదేశం

జిల్లాలో అంతంతమాత్రంగానే అమలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో గైనికాలజిస్టుల కొరత

పలుచోట్ల పనిచేయని స్కానింగ్‌ యంత్రాలు

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న గర్భిణులు

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌)

మాతాశిశు మరణాలను సంపూర్ణంగా అరికట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌’ (పీఎంఎస్‌ఎంఏ) పథకం క్షేత్రస్థాయిలో అంతంతగానే అమలవుతున్నది. ప్రతి నెలా 9వ తేదీన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్బిణులకు స్కానింగ్‌తో సహా అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ గైనికాలజిస్టుల కొరత, స్కానర్లు మూలకు చేరడం, ఏళ్ల తరబడి బాగుచేయించకపోవడం, తదితర కారణాలతో గర్భిణులకు అరకొరగానే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మాడుగుల సీహెచ్‌సీలో స్త్రీల వైద్య నిపుణులు లేరు. 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వున్నప్పటికీ ఒక్కచోట కూడా గైనికాలజిస్టులు లేకపోవడంతో ఆయా పీహెచ్‌సీల పరిధిలోని గర్భిణులు ప్రత్యేక వైద్య పరీక్షలు, స్నానింగ్‌ కోసం దూర ప్రాంతంలో వున్న ఇతర ప్రభుత్వ ఆస్పత్రులను లేదా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో ఆరుగురు, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు, సీహెచ్‌సీల్లో నలుగురు.. మొత్తం 12 మంది మాత్రమే గైనికాలజిస్ట్‌లు అందుబాటులో ఉన్నారు. మిగిలినచోట్ల గర్భిణులకు అవసరమైన పరీక్షలను సాధారణ వైద్యులే నిర్వహిస్తున్నారు. ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌’ పథకం కింద శుక్రవారం జిల్లాలోని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రితోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు అందిన వైద్య సేవలపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన...

గైనికాలజిస్టు పోస్టు ఖాళీ, మూలకు చేరిన స్కానింగ్‌ యంత్రం

మాడుగుల: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్ర్తీల వైద్య నిపుణులు (గైనికాలజిస్టు) పోస్టు చాలా కాలం నుంచి ఖాళీగా వుంది. దీంతో సాధారణ ప్రసవం కాని కేసులను చోడవరం లేదా అనకాపల్లి తరలిస్తుంటారు. ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయడంలేదు. సాధారణ వైద్యులు మాత్రమే వుండడంతో శుక్రవారం నలుగురు గర్భిణులు మాత్రమే వచ్చారు. స్కానింగ్‌ యంత్రం పాడైపోవడంతో మూలకు చేరింది. స్కానింగ్‌ పరీక్షలు అవసరమైన గర్భిణులను అనకాపల్లి లేదా విశాఖపట్నం పంపిస్తున్నారు.

150 పడకల ఆస్పత్రిలో ఇద్దరే గైనికాలజిస్టులు

నర్సీపట్నం: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో నెలకు 350 నుంచి 400 ప్రసవాలు జరుగుతుంటాయి. 150 పడకలు వుండడంతో ఆరుగురు గైనికాలజిస్టులు అవసరం. కానీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. శుక్రవారం సుమారు 80 మంది గర్భిణులు వైద్య పరీక్షలకు వచ్చారు. గైనికాలజిస్టులు ఇద్దరే వుండడం, వైద్య పరీక్షలతోపాటు స్కానింగ్‌ కూడా వీరే చేయాల్సి రావడంతో గర్భిణులు చాలా సేపు వేచివుండాల్సి వచ్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు.

పనిచేయని స్కానింగ్‌ యంత్రం

ఎలమంచిలి: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనికాలజిస్టు వున్నారు. సుమారు 16 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. కానీ అత్యంత ముఖ్యమైన స్కానింగ్‌ యంత్రం మూలకు చేరింది. దీంతో గర్భిణులను స్కానింగ్‌ పరీక్షల కోసం అనకాపల్లి రిఫర్‌ చేస్తున్నారు. సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్‌ తీయించుకోవడానికి గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సీహెచ్‌సీకి ఐదుగురు గర్భిణులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అనకాపల్లి టౌన్‌: ఎన్టీఆర్‌ వైద్యాలయంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 118 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఆరుగురు గైనికాలజిస్టులు వుండడంతో స్కానింగ్‌, రక్తపరీక్షలు వేగంగా సాగాయి.

కె.కోటపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో గైనిక్‌ వైద్య నిపుణులు అందుబాటులో వున్నారు. శుక్రవారం 32 మంది గర్భిణులు వైద్య పరీక్షలకు వచ్చారు. వీరిలో 22 మందికి స్కానింగ్‌ చేశారు.

నక్కపల్లి: స్థానిక సామాజిక ఆరోగ్యం కేంద్రంలో ఇటీవల గైనికాలజిస్టును నియమించడంతో గర్భిణులకు సకాలంలో వైద్యసేవలందుతున్నాయి. సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో గర్భిణులకు స్కానింగ్‌, ఇతర వైద్య పరీక్షలు చేస్తున్నారు. పాయకరావుపేట, నక్కపల్లి మండలాల నుంచి గర్భిణులు వస్తుంటారు.

గైనికాలజిస్టుల కొరత వాస్తవమే

డాక్టర్‌ హేమంత్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, అనకాపల్లి

జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో గైనికాలజిస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌’ పథకం కింద ప్రతి నెల 9వ తేదీన అన్ని ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సేవలు అందేలా చూస్తున్నాం. కొన్నిచోట్ల స్కానింగ్‌ యంత్రాలు పనిచేయకపోవడంతో సమీపంలోని మరో ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నాం.

Updated Date - 2022-12-10T01:13:45+05:30 IST