గిరి రైతుల్లో గుబులు

ABN , First Publish Date - 2022-12-12T00:56:49+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో మన్యంలో జల్లులతో కూడిన వర్షం కురుస్తున్నది. దీంతో తమ పంట తడిసిపోయి పాడవుతుందని గిరిజన వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. మాండస్‌ తుఫాన్‌ వల్ల ఏజెన్సీలో శనివారం రాత్రి నుంచి వాతావరణం మారిపోయింది. దీంతో జల్లులతో కూడిన వర్షం కొనసాగుతున్నది. తాజా వర్షానికి జనజీవనానికి అంతరాయం ఏర్పడగా, ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో రైతులు తమ పంటను కుప్పలుగా వేసి ప్లాస్టిక్‌ కవర్లతో కప్పుతున్నారు. అలాగే కోసిన వరి పనలు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు మోస్తున్నారు. తుఫాన్‌ ప్రభావానికి వరి పంట నాశనం కాకుండా ఉండేందుకు అవస్థలు పడుతున్నారు.

గిరి రైతుల్లో గుబులు
వంజంగి ప్రాంతంలో వరి కుప్పలపై ప్లాస్టిక్‌ కవర్లు వేసిన దృశ్యం

వర్షాలకు వరి పంట తడుస్తుందని ఆందోళన

పాడేరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో మన్యంలో జల్లులతో కూడిన వర్షం కురుస్తున్నది. దీంతో తమ పంట తడిసిపోయి పాడవుతుందని గిరిజన వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. మాండస్‌ తుఫాన్‌ వల్ల ఏజెన్సీలో శనివారం రాత్రి నుంచి వాతావరణం మారిపోయింది. దీంతో జల్లులతో కూడిన వర్షం కొనసాగుతున్నది. తాజా వర్షానికి జనజీవనానికి అంతరాయం ఏర్పడగా, ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో రైతులు తమ పంటను కుప్పలుగా వేసి ప్లాస్టిక్‌ కవర్లతో కప్పుతున్నారు. అలాగే కోసిన వరి పనలు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు మోస్తున్నారు. తుఫాన్‌ ప్రభావానికి వరి పంట నాశనం కాకుండా ఉండేందుకు అవస్థలు పడుతున్నారు.

పెదబయలులో..

పెదబయలు: మండలంలో పలు చోట్ల ఆదివారం భారీ వర్షం కురవగా, మండల కేంద్రంలో జల్లులతో కూడిన వర్షం కురిసింది. ప్రస్తుతం జోరుగా జరుగుతున్న వరి కోతలకు తుఫాన్‌ ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురుస్తుండడంతో చేతికి వచ్చిన వరి పంట నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ పంటను రక్షించుకునేందుకు గానూ రైతులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే ఖరీఫ్‌ వరితో పాటు ప్రస్తుతం పక్వానికి వచ్చిన రాజ్‌మా, రాగుల పంటలకు నష్టం వాటిల్లుతుందేమోనని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురు స్తూనే ఉంది. దీని వల్ల రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. వరి కుప్పలు తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పలు చోట్ల వరి కుప్పలు నానిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

అరకులోయలో..

అరకులోయ: మండలంలో ఉదయం నుంచి దఫదఫాలుగా వర్షం కురుస్తూనే ఉంది. వరి కోతలు కోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పనలు తడిసిపోతాయేమోనని కలత చెందుతున్నారు.

కొయ్యూరులో..

కొయ్యూరు: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వరి కోత దశకు వచ్చి కొంత, కోసినది కొంత పొలాలకే పరిమితం కావడంతో వర్షానికి చేతికొచ్చిన పంట నీటి పాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-12T00:56:50+05:30 IST