ప్చ్‌.. చి‘వరి’లో ఇలా..!

ABN , First Publish Date - 2022-12-12T01:27:59+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ తీరం దాటినా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తుండడం వరి రైతులను కలవరపెడుతోంది. అష్టకష్టాలు పడి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, తీరా పంట చేతికందే సమయంలో వరుణుడు చిన్నచూపు చూస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు.

ప్చ్‌.. చి‘వరి’లో ఇలా..!
కోటవురట్ల మండలంలో యండపల్లిలో తడిసిముద్దయిన వరి పనలు

నక్కపల్లి, డిసెంబరు 11 : మాండస్‌ తుఫాన్‌ తీరం దాటినా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తుండడం వరి రైతులను కలవరపెడుతోంది. అష్టకష్టాలు పడి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, తీరా పంట చేతికందే సమయంలో వరుణుడు చిన్నచూపు చూస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు.

నక్కపల్లి మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకూ అడపా దడపా చిరుజల్లుల వర్షం పడింది. దీంతో పలు గ్రామాల్లోని రైతులు వర్షపు నీరు పొలాల్లో నిల్వలేకుండా చూసుకున్నారు. కానీ కోత కోసిన పొలాల్లో ఉంచిన వరి పనలు కొంతమేర నీటటిలో తడిసిపోయాయి. ఆదివారం నాడు వర్షం తెరిపిస్తే పెద్దగా నష్టం ఉండదని భావించారు. కానీ ఆదివారం నాటి పరిస్థితితో అంతా తారుమారైంది. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ వర్షం పడింది. దీంతో కోత కోసిన వరి పొలాల్లో నీరు చేరిపోయింది. ఈ నీటిలో వరి పనలు నానిపోతుండడంతో అన్నదాతలు అయోమయాని గురవుతున్నారు. నక్కపల్లి మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 5,170 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. డిసెంబరు మొదటి వారంలో సుమారు 25 శాతం కోతలు జరిగాయి. మాండస్‌ తుఫాన్‌ కారణంగా రెండు రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురవడంతో దేవవరం, చిన రాంభద్రపురం, గొడిచెర్ల, ఉద్దండపురం, జి.జగన్నాథపురం, గుల్లిపాడు, వేంపాడు, అమలాపురం, డీఎల్‌పురం, బంగారమ్మపేట, ఉపమాక, కాగిత, ఎన్‌.నర్సాపురం,చందనాడ గ్రామాల్లో సుమారు 450 ఎకరాల్లో కోత కోసిన వరి పనలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు.

పాయకరావుపేట రూరల్‌ : తాజా వర్షాలతో అన్నదాతల్లో అలజడి రేగుతోంది. తుఫాన్‌ కారణంగా మూడు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో వరి పంటపై ఈ ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పాయకరావుపేట మండలంలో సుమారు 3444 హెక్టార్లలో రైతులు వరిసాగు చేపడుతున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో పంట ఆశాజనకంగా పండింది. కొందరు రైతులు ఇప్పటికే కోతలు కోశారు. కొన్నిచోట్ల పొలంలోనే పనలు ఉండగా, కొంతమంది రైతులు తుఫాన్‌ హెచ్చరికలతో పనలు ఆరకుండానే హడావుడిగా కుప్పలు వేసేశారు. దీంతో పంట పరిస్థితి ఎలా ఉంటుందోనని సదరు రైతులు కలవరపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో తమకు ఏమిటీ దుస్థితని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోటవురట్ల : తుఫాన్‌ ముప్పు తప్పినా వరి పంటకు నష్టం తప్పేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు అడపాదడపా వర్షాలు కురస్తూనే ఉన్నాయి. దీంతో వరి పంటను కోసి పొలాల్లో విడిచిపెట్టడంతో నీరు చేరి పనలు తడిసిపోయాయి. దీంతో పంట ఎలా ఉంటుందోనని ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడి తడిసిమోపెడైందని, ఇప్పుడు ఈ పంటను కాపాడుకునేందుకు మరిన్ని కష్టాలు పడక తప్పదని అంటున్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తకుండా వరి కంకులపై ఉప్పనీటి ద్రావణం పిచికారీ చేయడం, తడిసిన పనలను ఒడ్డుకు చేర్చి ఆరబెట్టడం వంటివి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ పనులన్నీ వర్షం తెరిపిస్తేగానీ సాధ్యం కాదని, మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటే పంటకు బాగా నష్ట తప్పదని పేర్కొంటున్నారు. ఈ దశలో పంటను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి వివరించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

పరవాడ : తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు మండలంలోని పలు చోట్ల వరి చేళ్లు నేలకొరిగాయి. వర్షానికి గాలులు తోడుకావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈఏడాది మండలంలో 500 హెకార్లలో రైతులు వరిపంట వేశారు. దిగుబడి బాగానే ఉన్నప్పటికీ వాతావణంలో మార్పులు అన్నదాతలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే దాదాపు యాభై శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఈ నెల మూడో వారం నాటికి కోతలు పూర్తి చేయాలని అంతా భావించారు. ఇంతలోనే తుఫాన్‌ రావడంతో కొన్నిచోట్ల వరి పనలు పొలాల్లో ఉండిపోవడంతో నానిపోయాయి.

Updated Date - 2022-12-12T01:27:59+05:30 IST

Read more