వైద్య ఆరోగ్యంలో కుదుపు

ABN , First Publish Date - 2022-02-08T06:42:43+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

వైద్య ఆరోగ్యంలో కుదుపు

ఒకేచోట ఐదేళ్లు పైబడి పనిచేస్తున్న వారంతా బదిలీ

జాబితాలో ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు చెందిన 297 మంది వైద్యులు

కేజీహెచ్‌లో మరో 27 మంది...

వందలాది మంది నర్సింగ్‌ సిబ్బందికి స్థానచలనం

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో 700 మంది, ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 900 మంది ఉద్యోగులు బదిలీ

నేటి నుంచి ఆప్షన్లు, అభ్యంతరాలకు అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

వైద్య, ఆరోగ్య శాఖలో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ, ఆంధ్రా మెడికల్‌ కళాశాలల పరిధిలో వివిధ కేడర్లకు సంబంధించి బదిలీ కానున్న వైద్యులు, సిబ్బంది వివరాలను సిద్ధం చేశారు. ఈ జాబితాను సోమవారం రాత్రికి ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్స్‌ పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఈసారి బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో, అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి తెలిపారు. 


ఆంధ్ర మెడికల్‌ కళాశాల పరిధిలో.. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వందలాది మంది వైద్యులు బదిలీపై వెళ్లనున్నారు. ఆంధ్రా మెడికల్‌ కళాశాల పరిధిలోని బోధనాస్పత్రులైన కేజీహెచ్‌, ఛాతీ, అంటువ్యాధులు, మానసిక ఆస్పత్రి, ఈఎన్‌టీ, ఆర్‌సీడీ, ఘోష, ప్రాంతీయ కంటి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 400 మంది వైద్యుల్లో 297 మంది

ఐదేళ్లకుపైబడి ఇక్కడే పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 44 మంది ప్రొఫెసర్లు, 51 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, మరో 202 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలను ఇప్పటికే డీఎంఈ కార్యాలయానికి అధికారులు పంపించారు. అదేవిధంగా కేజీహెచ్‌లో మరో 27 మంది వైద్యులు బదిలీ కానున్నారు. కేజీహెచ్‌లో 126 మంది నర్సింగ్‌ సిబ్బంది బదిలీపై వెళ్లనున్నారు. వీరిలో 99 మంది స్టాఫ్‌ నర్సులు, 27 మంది హెడ్‌ నర్సులు ఉన్నారు. అలాగే మిగిలిన బోధనాస్పత్రుల పరిధిలో మరో 100 వరకు స్టాఫ్‌ నర్సులకు బదిలీ కానుంది. 


వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో.. 

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పలు కేడర్లకు సంబంధించి సుమారు 743 మంది ఉద్యోగులకు బదిలీ కానుంది. ఇందులో ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ల్యాబ్‌ అటెండెంట్లు, ఆఫీస్‌ అటెండెంటెంట్లు, ఫార్మసిస్టులు ఉన్నారు.  


ప్రాంతీయ కార్యాలయ పరిధిలో.. 

వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సుమారు 900 మంది ఉద్యోగులకు బదిలీ కానున్నది. ప్రాంతీయ కార్యాలయ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 28 కేడర్లు ఉండగా, అందులో ఆరు కేడర్లకు సంబంధించి ఐదేళ్లు పూర్తయినవారు ఎవరూ లేరని అధికారులు తేల్చారు. మిగిలిన 22 కేడర్ల ఉద్యోగులు అంటే...స్టాఫ్‌ నర్సులు, హెడ్‌ నర్సులు, సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు, పబ్లిక్‌ హెల్త్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సూపరింటెండెంట్లు బదిలీ కానున్నారు. 


ఉద్యోగులకు అవకాశం

బదిలీ అవుతున్న ఉద్యోగులు వివరాలను సోమవారం రాత్రిలోగా ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ పొందుపరిచిన వివరాల్లో తప్పిదాలు వుంటే మంగళవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు సంబంధిత ఉద్యోగులు అభ్యంతరాలు చెప్పవచ్చు. యూనియన్‌ బేరర్లు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయవచ్చు. అదేవిధంగా ఆయా ఉద్యోగులు తాము వెళ్లదలుచుకున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో ఉద్యోగి 20 ప్రాంతాలను ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఆయా అభ్యంతరాలు, ఇతర అంశాలను పరిశీలించి..బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈనెల 28వ తేదీ నాటికి కొత్త స్థానాల్లో ఆయా ఉద్యోగులు చేరాల్సి ఉంటుంది. 

Read more