భారంగా విమానయానం

ABN , First Publish Date - 2022-11-30T01:08:18+05:30 IST

విమాన ప్రయాణం భారంగా మారుతోంది. ఇంధనం, నిర్వహణ వ్యయం పెరగడంతో విమాన సంస్థలు టిక్కెట్‌ రేట్లను భారీగా పెంచేశాయి. మరోవైపు విమానాల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

భారంగా విమానయానం

హైదరాబాద్‌కు టిక్కెట్‌ ధర రూ.9 వేలు

రిటర్న్‌ టిక్కెట్‌ రూ.11 వేలు

నాలుగు రోజుల ముందు బుక్‌ చేసినా భారీ రేట్లు

విమానాల సంఖ్య తగ్గడమే కారణం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విమాన ప్రయాణం భారంగా మారుతోంది. ఇంధనం, నిర్వహణ వ్యయం పెరగడంతో విమాన సంస్థలు టిక్కెట్‌ రేట్లను భారీగా పెంచేశాయి. మరోవైపు విమానాల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దాంతో డిమాండ్‌ పెరిగి, అత్యవసర ప్రయాణాలు చేసేవారు అధిక రేట్లు పెట్టి టిక్కెట్లు కొనాల్సి వస్తోంది. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు సాధారణ సమయాల్లో టిక్కెట్‌ రేటు ఇటీవల కాలంలో రూ.3,500 ఉండేది. పది రోజులు ముందుగా బుక్‌ చేసుకుంటే అదే ధర. అక్కడి నుంచి సమయం తగ్గుతున్న కొద్దీ రేటు పెరుగుతోంది. విమానంలో 60 శాతం సీట్లు నిండిపోయిన తరువాత ఆ సంస్థలు మిగిలిన సీట్లను ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాయి. సాధారణంగా ఒకరోజు ముందు ప్రయాణానికి టిక్కెట్‌ కొనుక్కున్న వారే ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది. బుధవారం ప్రయాణానికి మంగళవారం టిక్కెట్‌ తీసుకుంటే రూ.7 వేల నుంచి రూ.10 వేలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఐదు రోజుల ముందు బుక్‌ చేసినా అదే రేటు పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నగరానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త డిసెంబరు ఒకటో తేదీన హైదరాబాద్‌ వెళ్లాలని ఈ నెల 28న టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే రూ.9 వేలు తీసుకున్నారు. అంటే నాలుగు రోజుల ముందు తీసుకున్నా...ఒకటిన్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అటు నుంచి రిటర్న్‌ జర్నీ కోసం డిసెంబరు రెండో తేదీకి బుక్‌ చేసుకుంటే...దానికి రూ.11 వేలు వసూలుచేశారు. అంటే హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం రావడానికి కూడా అధిక మొత్తాలు వెచ్చించాల్సి వస్తోంది. విమాన టిక్కెట్లకు రానుపోను రూ.20 వేలు, విమానాశ్రయాలకు వెళ్లి రావడానికి టాక్సీలకు రానుపోను మరో రూ.5 వేలు పెట్టాల్సి వస్తుందని, అంటే హైదరాబాద్‌కు వెళ్లి వస్తే రూ.25 వేలు ఖర్చు అవుతోందని ఆ పారిశ్రామివేత్త వివరించారు. ఇంత ఖర్చు ఎన్నడూ లేదని, ఇటీవలె ఇలా జరుగుతోందని వ్యాపారవేత్తలు సైతం ఆరోపిస్తున్నారు.

కారణాలు అనేకం

ఇంధన వ్యయం పెరిగిన తరువాత టిక్కెట్‌ రేట్లు పెరిగాయి. విమాన సంస్థలు రద్దీ తక్కువగా వుండే రూట్లలో విమానాలు తీసేసి, డిమాండ్‌ ఉన్న మార్గాల్లో నడుపుతున్నాయి. ఇది ఒక కారణం కాగా, విశాఖపట్నం విమానాశ్రయంలో డిమాండ్‌ వున్న సమయాల్లో స్లాట్లు కేటాయించడం లేదు. దాంతో విమానాలు ఇటు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది మరో కారణం. విశాఖపట్నంలో నైట్‌ పార్కింగ్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చినా దానిని ఉపయోగించుకునేలా ఎవరూ ప్రోత్సహించడం లేదు. అలవాటు అయ్యేంత వరకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడి విమానాశ్రయం అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. ఈ కారణాల వల్ల ఇటీవల ఇండిగో, స్పైస్‌ జెట్‌ సంస్థలు హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే విమానాలను తగ్గించుకున్నాయి. ఇక..హైదరాబాద్‌కు ఉదయం ఏడెనిమిది గంటలకు చేరుకునే విమానాలకు మాత్రమే ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. మిగిలిన సమయాల్లో అంతకంటే రూ.2 వేల నుంచి రూ.3 వేలు తక్కువకు దొరుకుతున్నాయి. అంటే ప్రయాణికులకు అవసరమైన సమయాల్లో స్లాట్లు కేటాయిస్తే, మరిన్ని విమానాలు అందుబాటులోకి వస్తాయి. రేట్లు తగ్గుతాయి. కానీ ఇక్కడ విమానాశ్రయం అధికారులు నేవీని అందుకు ఒప్పించడం లేదు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి

కుమార్‌రాజా, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మ,

విశాఖ విమాన ప్రయాణికుల సంఘం

విమానాశ్రయం అధికారులు అవసరమైన సమయాల్లో స్లాట్లు కేటాయించకపోవడం వల్ల విమానాల సంఖ్య పెరగడం లేదు. రేట్లు పెరిగాయని పలువురు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో విమానాలను ఈ రూట్లలో నడపడానికి సంస్థలు ఆసక్తి చూపడం లేదు. దాంతో కొన్ని సర్వీసులు రద్దయిపోతున్నాయి. ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని స్లాట్లు కేటాయించకపోతే ఇంకా రేట్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది.

గత క్వార్టర్‌లో తగ్గిన విమానాల సంఖ్య

2022-23 ఆర్థిక సంవత్సరంతో తొలి మూడు నెలలకు అంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 5,358 విమానాలు రాకపోకలు సాగించాయి. వాటిలో 5,94,400 మంది ప్రయాణించారు.

రెండో క్వార్టర్‌ అంటే జూలై నుంచి సెప్టెంబరు వరకు చూసుకుంటే విమానాల సంఖ్య 4,952కి తగ్గిపోయింది. అంటే దాదాపు 400 విమానాలు తగ్గిపోయాయి. అలాగే ప్రయాణికుల సంఖ్య కూడా 5,57,652కి పడిపోయింది.

రాష్ట్రంలో ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతి విమానాశ్రయంలోను ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ తొలి క్వార్టర్‌లో 2,660 విమానాలు నడవగా, రెండో క్వార్టర్‌లో ఆ సంఖ్య 2,519కే పరిమితమైంది. ప్రయాణికుల సంఖ్య తొలి క్వార్టర్‌లో 2,33,412 కాగా రెండో క్వార్టర్‌లో అది 2,21,228కి పడిపోయింది.

Updated Date - 2022-11-30T01:08:19+05:30 IST